వైసిపి కార్యకర్తలకు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాక్లెట్లు పంచారు. నమ్మలేకపోతున్నారా.. అయితే ఇది నిజం. ఈసారి స్పెషల్‌గా వ్యవహరించారు.  ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడెంలో వైసిపి కార్యకర్తలకు చాక్లెట్లు, పూలు ఇచ్చారు. దీంతో అక్కడనున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 

 

వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ఏలూరు రూరల్ పరిధిలో సాగుతోంది.  లింగారావుగూడెం వైపు జగన్ నడక సాగుతుండగా.. అదే గ్రామంలో చర్చీ ప్రారంభోత్సవానికి చింతమనేని వచ్చారు. పాదయాత్ర మధ్య ట్రాఫిక్‌లో  ఎమ్మెల్యే కారు చిక్కుకుపోయింది.  దీంతో ఏం జరుగుతుందోనని పోలీసులు టెన్షన్ పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పరుగులు పెట్టారు. అయితే చింతమనేని మాత్రం  వైసిపి కార్యకర్తలతో మాట్లాడుతూ కూల్‌గా గడిపారు. వారికి చాక్లెట్లు పంచి సరదాగా ముచ్చటించారు.