చంద్రబాబు పరువు తీసేసిన చింతమనేని

చంద్రబాబు పరువు తీసేసిన చింతమనేని

తెలిసి చేసాడో లేక యధాలాపంగా చేశాడో తెలీదు కానీ మొత్తానికి దెందులూరు టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి పరువు తీసేశాడు. నిత్యం తన చేష్టలతో వార్తల్లో ఉండే చింతమనేని తాజాగా చేసిన ఓ పని వల్ల చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకీ చింతమనేని చేసిందేమిటి ? చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందులేమిటి? విషయమేమిటంటే, చింతమనేనికి పశువులు,మేకలు, గొఱ్ఱెలంటే చాలా ఇష్టమట. దెందులూరులోని తన ఇంట్లో కూడా పశు సంపద చాలా ఎక్కువట. వాటి పోషణపై ఎంఎల్ఏ బాగా దృష్టి పెడతాడు. అంటే, ఒకరకంగా మనుషులతో కన్నా వాటితోనే బాగా సన్నిహితంగా ఉంటాడన్న విషయం అర్ధమైపోతోంది.

అటువంటి చింతమనేనికి ఓ చిక్కు వచ్చిపడింది. అదేంటంటే, పది రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి రావటం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు చింతమనేని పదిరోజులు హాజరవ్వాల్సి వచ్చింది. పది రోజులు తాను ఊర్లో లేకపోతే పశుపోషణ ఎట్లా అన్నది పెద్ద సమస్యగా మారింది. అందుకని ఓ దివ్వమైన ఆలోచన చేశారు. అమరావతిలో తానుండే పది రోజులూ తన పశువులను కూడా తీసుకొచ్చేస్తే సరిపోతుందని భావించారు.

ఇంకేం, దెందులూరు నుండి 120 గేదెలు, మేకలు, గొర్రెలతో సహా అమరావతిలో దిగిపోయారు. ఎందుకంటే, అమరావతిలో ఎటుతిరిగీ వేలాది ఎకరాల ఖాళీ స్ధలముంది. రాజధాని నిర్మాణం పేరుతో దాదాపు ఏడాదిన్నర క్రితమే రైతుల నుండి చంద్రబాబు ప్రభుత్వం పచ్చటి పంట పొలాలను తీసేసుకుంది. వేలాది ఎకరాల్లో ప్రస్తుతానికి ఉన్నది ఒక్క అసెంబ్లీ, సచివాలయం మాత్రమే. అంటే మిగిలిన ఖాళీ స్ధలమంతా పచ్చ గడ్డి, పిచ్చి మొక్కలే. అందుకనే తన పశు సంపదను అసెంబ్లీ భవనాల వెనుక వదిలిపెట్టేసారు.

అసెంబ్లీ భవనాల వెనుక వాటి కోసం పెద్ద టెంట్లు వేసి పాలేర్లకు బాధ్యత అప్పగించేసారు. దాంతో అవి చక్కటి అమరావతి గడ్డిని మేస్తూ హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.  తీరిక సమయాల్లో చింతమనేని వెళ్ళి పశులను కాస్తున్నారు. ఎంఎల్ఏ చేస్తున్న పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంఎల్ఏ ఉద్దేశ్యంలో పది రోజులు పశువులను ఇక్కడ వదిలిపెట్టటమా లేక శాస్వతంగా ఇక్కడే ఉంచేయటమా అని చర్చించుకుంటున్నారు.

ఎలాగూ రాజధాని నిర్మించే అవకాశాలు ఇప్పట్లో లేవు కాబట్టి పశు పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చింతమనేని అనుకున్నారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. దాన్నే అవకాశంగా తీసుకుని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేతలు కూడా చింతమనేని పశువులు-రాజధాని నిర్మాణాలకు ముడేసి చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తమ ఎంఎల్ఏ చేసిన పనితో ఏం సమాధానం చెప్పాలో తెలీక టిడిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page