హిందూపురం: రెండేళ్లలో ఏం చేశారో శ్వేత ప్రతం విడుదల చేయాలని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ డిమాండ్ చేశారు.

గురువారం నాడు హిందూపురం నియోజకవర్గంలోని సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, మధ్యం మాఫియాల రాజ్యం నడుస్తోందన్నారు. జవాబుదారీతనం ఉన్న పార్టీకి ఓట్లేయాలని ఆయన ప్రజలను కోరారు.

నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో లేవన్నారు. రెండేళ్లలో అన్ని వ్యవస్థలను జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని ప్రైవేట్ పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని ఆయన ఆరోపించారు.

ఒకరు చంద్రబాబును తిట్టడానికి, మరొకరు లిక్కర్ మాఫియాకు అండగా ఉన్నారని బాలకృష్ణ విమర్శించారు.హిందూపురం మున్సిపాలిటీలో ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకొన్నామన్నారు. బెదిరింపులతో ఏకగ్రీవాలకు వైసీపీ పాల్పడుతోందని ఆయన విమర్శించారు. 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్ తో పాటు ఆయా జిల్లాల్లో పార్టీకి చెందిన అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే హిందూపురంలో బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.