టిటిడి వివాదంపై ఆంధ్రా టిడిపి ఎమ్మెల్యే అనిత ఏమన్నారంటే ?

TDP MLA Anita says she is hindu ycp made it controversy
Highlights

తనపై వస్తున్న విమర్శలకు టిడిపి ఎమ్మెల్యే అనిత స్పందించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమితులైన టిడిపి పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత విషయంలో రేగుతున్న వివాదంపై ఆమె స్పందించారు. తాను హిందువునే అని వివరణ ఇచ్చారు. వైసిపి కావాలని కుట్ర బుద్ధితో ఇలా విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

అనిత హిందూ కాదని, ఆమె క్రిస్టియన్ అని రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఆమె గతంలో ఒక టివి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పక్కా క్రిస్టియనే అని వెల్లడించింది. అంతేకాకుండా తన బ్యాగులో బైబిల్ ఉంటుందని, తన ఇంట్లోనూ బైబిల్ ఉంటుందన్నారు. బైబిల్ లేనిదే తాను బయటకు కదలనని ఇంటర్వ్యూలో అని వివరణ ఇచ్చారు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనిత క్రిస్టియన్ కాబట్టి ఆమెను టిటిడి బోర్డు సభ్యురాలిగా ఎలా నియమిస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే తనపై వస్తున్న విమర్శలకు టిడిపి ఎమ్మెల్యే అనిత స్పందించారు. తన పాత వీడియోను వైసిపి వాళ్లు ఓర్వలేనితనంతో బయటపెట్టారని విమర్శించారు. అంతేకాదు.. ఆ వీడియోలోనే తాను బొట్టు, గాజులు పెట్టుకున్న విషయాన్ని వైసిపి వాళ్లు మరచిపోయి విమర్శలకు దిగడం శోచనీయమన్నారు. తాను పక్కా హిందూ అమ్మాయినే అని ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తన బర్త్ సర్టిఫికెట్ లో, తన స్టడీ సర్టిఫికెట్లలో కూడా హిందూ అనే ఉందన్న విషయాన్ని వెల్లడించారు.

అయితే అనిత విషయంలో టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు డైలమాలో పడ్డట్లు టిడిపి వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె వీడియోను సైతం చంద్రబాబు పరిశీలించారని, దానిపై ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

మరోవైపు అనిత వీడియోను టిడిపి వాళ్లు కూడా సోషల్ మీడియాలో (వాట్సాప్ లలో) షేర్ చేస్తున్నారు. టిడిపిలోని అనిత ప్రత్యర్థులు కూడా వీడియోను షేర్ చేస్తున్నారు. ఎందుకంటే అనితకు పదవి క్యాన్సల్ అయితే తమకు దక్కుతుందేమోన్న ఉద్దేశంతో టిడిపిలోని అనిత ప్రత్యర్థులు వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి అన్ని కోణాల్లో పరిశీలించి ఆమె నియామకం విషయంలో చంద్రబాబు వెనక్కు తగ్గుతారా? లేదా ఆమెకు క్లియరెన్స్ ఇస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

loader