Asianet News TeluguAsianet News Telugu

బీసీలను బిచ్చగాళ్లుగా చేయడమే మీ సంక్షేమమా.?: జగన్ కు నిలదీసిన టిడిపి ఎమ్మెల్యే

వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని బిసి లకు అన్యాయం చేస్తోందంటూ టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వారిని ఎలా అన్యాయం చేస్తున్నారో వివరిస్తూ సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. 

tdp mla anagani satyaprasad writes letter to cm ys jagan akp
Author
Amaravati, First Published Aug 1, 2021, 9:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: వైసిపి ప్రభుత్వం బిసి కార్పోరేషన్ నుండి ఏకంగా రూ.18,050 కోట్లను ఇతర పథకాలకు మళ్లించారని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు... తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయన్నారు. నిధులు మళ్లింపుకు సంబంధించిన వివరాలతో సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు టిడిపి ఎమ్మెల్యే.

అనగాని లేఖ యధావిధిగా... 

 వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్.

విషయం: బీసీ సంక్షేమ నిధులు మళ్లింపు – కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తున్న వైనం – స్వయం ఉపాధి రుణాలు రద్దు, ఫెడరేషన్ రుణాలు రద్దు వంటి అంశాలపై..

అభివృద్ధికి, రెక్కల కష్టానికి చిరునామాగా ఉండే బీసీల పట్ల గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం, వివక్షా పూరిత విధానాలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం.. బీసీలను ఉద్దరించేశామంటూ మీరు చేస్తున్న ప్రసంగాలు, ప్రచారం పచ్చి మోసం, దగా. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుండి రూ.18,050 కోట్లు మళ్లించి బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారు. బీసీ అభ్యున్నతి పేరుతో హడావుడి చేస్తూ.. ఏ విధంగా బీసీల నిధులు మళ్లించారో సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నాం. బీసీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాం అంటున్న ప్రభుత్వం.. అందులో మళ్లించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు.? 2019-20లో రూ.15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించి అందులో రూ.10,478 కోట్లు మళ్లించారు. 2020-21లో రూ.23వేల కోట్లు, 2021-22లో రూ.25వేల కోట్లు బీసీ కార్పొరేషన్ నుండి మళ్లించేశారు. మిగిలిన సొమ్ములో కూడా అధిక భాగం పత్రికా ప్రకటనలకు వెచ్చించారే తప్ప.. బీసీల అభ్యున్నతి కోసం కాదు.

ఆర్ధిక సంవత్సరం    బట్జెట్ కేటాయింపు    మళ్లించిన నిధులు
2019-20                      రూ.15,061 కోట్లు            రూ.10,478 కోట్లు
2020-21                      రూ.25,331 కోట్లు            రూ.23,458 కోట్లు
2021-22                      రూ.28,237 కోట్లు            రూ.25,000 కోట్లు

జగనన్న నిధుల మళ్లింపు పథకంతో బీసీల నిధుల్ని వైసీపీ నేతల జేబుల్లోకి మళ్లిస్తున్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ.. రాజ్యాంగబద్దంగా సిద్ధించిన హక్కుల్ని కాలరాస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా అందించే స్వయం ఉపాధి ఉపాధి రుణాల కోసం గత రెండేళ్లలో రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే.. ఒక్కరికి కూడా రుణం మంజూరవ్వలేదు. పైగా గతంలో మంజూరైన రుణాలు వినియోగించుకోలేదంటూ, ఆ నిధులను వెనక్కి చెల్లించాలంటూ ఉత్తర్వులిచ్చారు. 

కాపు కార్పొరేషన్ ద్వారా మంజూరైన 45వేలకు పైచిలుకు రుణాలను అర్ధాంతరంగా రద్దు చేశారు. బీసీ ఫెడరేషన్లన్నింటినీ నిర్వీర్యం చేశారు. సబ్ ప్లాన్ అన్న మాటే లేకుండా చేశారు. మత్స్యకారులకు సబ్సిడీపై అందాల్సిన పడవలు, వలలు, ఇతర పరికరాలు రద్దు చేశారు. చేనేతలకు నూలు, రంగులు సహా ఇతర వస్తువులపై సబ్సిడీలు ఎత్తేశారు. రజకులకు సబ్సిడీపై అందాల్సిన పరికరాలు, ఉచితంగా ఏర్పాటవ్వాల్సిన భవనాలు రద్దు చేశారు. నాయీ బ్రాహ్మణులకు కార్పొరేషన్, ఫెడరేషన్ రుణాలు లేవు, పరికరాల పంపిణీ లేదు. 90శాతం సబ్సిడీతో అందించిన ఆదరణ పథకాన్ని భ్రష్టు పట్టించారు. పరికరాలను తుప్పుపట్టించారు. బీసీలు అధికంగా ఉండే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని సైతం సొంతానికి వాడుకున్నారు. బీసీలకు సంబంధించిన అన్ని పథకాలను, సబ్సిడీలను ఎత్తేసి.. 139 కులాల్లో నాలుగు కులాలకు చిల్లర విదిల్చి అదే బీసీల సంక్షేమం అంటూ కలరింగ్ ఇస్తున్నారు.

టీడీపీ హయాంలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా లక్షలాది మంది లబ్ది పొందారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని వ్యాపారస్తులుగా ఎదిగారు. ఇప్పుడా రుణాలు ఎందుకు రద్దు చేశారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పది మందికి చిల్లర విదిల్చడం సంక్షేమమా.. లేక లక్షల రూపాయల సబ్సిడీలు ఇచ్చి జీవితాలను మెరుగు పర్చడం సంక్షేమమా.? బీసీలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ధిక భరోసా అందిస్తే.. మీరు బీసీలకు చిల్లర వేసి బానిసలుగా చేస్తున్న మాట వాస్తవం కాదా. బడ్జెట్లో కార్పొరేషన్లకు రూపాయి కేటాయించకుండా.. ఏదేదో చేసేశామంటూ ప్రచారం చేసుకుంటూ వంచిస్తున్నారు.? 

బీసీ సంక్రాంతి, ఛైర్మన్ల నియామకం అంటూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల కోసం చేసిన ఖర్చులో సగం కూడా బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదన్నది వాస్తవం కాదా.? బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప.. ఏనాడైనా వారి బతుకుల్ని మార్చేందుకు ప్రయత్నించారా.? బీసీల నిధులు మళ్లించి బీసీ ద్రోహిగా మిగిలారు. అధికార పార్టీ నేతల అవినీతి దాహం తీర్చుకోవడానికి బీసీలను అణగదొక్కుతూ.. బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జనాభాలో సగం ఉన్న బీసీలను.. బిచ్చగాళ్లుగా చేయాలనుకోవడమే సంక్షేమమా.?


ఇట్లు, 
భవదీయుడు, 
అనగాని సత్యప్రసాద్, 
రేపల్లె శాసనసభ్యులు. 

Follow Us:
Download App:
  • android
  • ios