గుంటూరు: రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్ కు సూచించారు. విద్యాసంస్థరం నష్టపోకుండా వారికి డిజిటల్ క్లాసులు నిర్వహించాలని...అందుకోసం అవసరమైన ట్యాబ్ లు, ల్యాబ్ ట్యాబ్ లు ప్రభుత్వమే వారికి అందించాలని సూచించారు. ఇలా విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతూ ఓ బహిరంగ లేఖ రాశారు అనగాని. 

సీఎం జగన్ కు అనగాని రాసిన బహిరంగ లేఖ యధావిధిగా....

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి

ముఖ్యమంత్రి, 

నమస్కారములు...

విషయం : కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలి. పాఠశాల విద్యార్ధులకు ట్యాబ్ లు, కళాశాల విద్యార్ధులకు ల్యాబ్ ట్యాబ్ లు అందించాలి. ఉపాధ్యాయులకు ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహించేందుకు అనుమతికి సంబంధించి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్ధులకు తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్న విషయం మీకు విధితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణే అత్యుత్తమమైన మార్గమని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా డిజిటల్ తరగతుల నిర్వహణను ప్రారంభించాయి. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్ధులకు ఇంత వరకు తరగతులు ప్రారంభం కాలేదు. ఎప్పుడు అవుతాయో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డిజిటల్ తరగతుల నిర్వహణే ఉత్తమ మార్గం.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ట్యాబ్ లు, జూనియర్ కాలేజీ విద్యార్ధులకు ల్యాబ్ ట్యాబ్ లు అందించి అందరి విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులకు తగిన సదుపాయాలు ఉచితంగా అందించి ప్రోత్సహాకాలు కల్పించాలి.  డిజిటల్ తరగతుల నిర్వహణకు సిబ్బందిని సంసిద్ధం చేయాలి.  ఈ ఏడాది డిజిటల్ తరగతుల నిర్వహణ ద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.  ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్థలు డిజిటల్ మార్గాన్ని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. అదే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయడం ద్వారా విద్యార్ధుల భవిష్యత్తుకు మరో ఉత్తమమైన మార్గాన్ని అందించినట్లు అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి విద్యార్ధుల భవిష్యత్తు కోసం సముచిత నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నాం.                                                                                                                               

అనగాని సత్యప్రసాద్

  శాసనసభ్యులు.