గుంటూరు: గతకొంత కాలంగా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టిడిపి పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి తీర్థం పుచ్చుకోగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని కూడా వైసిపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారాలపై అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 

టిడిపిని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇలాంటి పుకార్లు జరగడం ఇది మూడోసారని అన్నారు. టిడిపి అధినేత 
చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పోరాటంలో ఆయనకు అండగా ఉంటున్నాననే కొందరు కుట్రలు పన్ని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సింది పార్టీనే అని అనగాని స్పష్టం చేశారు. 

ఇటీవల జరిగిన మహానాడులో అనగాని పాల్గొనకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.  పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చే మహానాడుకు వెళ్లలేదని తెలిపారు. ఇక తాను మంత్రి బాలినేనిని కలిశానని జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని... దాన్ని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆనగని సత్యప్రసాద్ సవాల్ విసిరారు. 

read more   టిడిపి కార్యకర్తలపై దాడులు...వెంటనే డిజిపి స్పందించాలి: చంద్రబాబు డిమాండ్

గత ఏడాది చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జగన్‌కు జై కొట్టారు. వైసీపీలో చేరుతానని ప్రకటించారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌‌పై వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో వల్లభనేని వంశీపై టీడీపీ నాయకత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

 మరో వైపు ఈ నెల మొదటి వారంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్ ను కలిశారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. మద్దాలి గిరిపై చంద్రబాబునాయుడు  చర్యలు తీసుకోలేదు. వ్యూహత్మకంగానే పార్టీ నాయకత్వం గిరిపై సస్పెన్షన్ వేటు వేయలేదని చెబుతున్నారు.