గుంటూరు: పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో టిడిపి కార్యకర్తలపై జరిగిన దాడులపై దాడులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. టిడిపి కార్యకర్తలపై రోజురోజుకు దాడులు ఎక్కువయ్యాయని... ఇలా ఏపీలో వైసిపి అరాచక పాలన సాగుతోందంటూ ధ్వజమెత్తారు.   

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామానికి చెందిన మాలెంపాటి గోపి తదితరులపై వైసిపి నాయకులు దాడి చేసి గాయపర్చడాన్ని ఆయన గర్హించారు. అడ్డుపడిన గోపి అమ్మ, అమ్మమ్మలపై కూడా దాడి చేయడం అమానుషం అన్నారు. మహిళలపై కూడా వైసిపి అరాచకశక్తులు దాడులకు తెగబడటం పాశవిక చర్యగా మండిపడ్డారు. 

read more   సాయంత్రం ఆరు లోపే ఇసుక డోర్ డెలివరీ..వారికోసమే: జగన్ ప్రభుత్వ నిర్ణయం

ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామంలో టిడిపి కార్యకర్తలు అనిమేష్, మల్లయ్య, నీలకంఠం, నాగరాజులపై  జరిగిన దాడుల గురించి కూడా చంద్రబాబు స్పందించారు. వైసిపి నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

''బీసిలు, దళితులపై వైసిపి దాడులు గత ఏడాదిగా శృతి మించి పోయాయని ఆవేదన చెందారు. ఇక టిడిపి కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరుల ఆస్తుల ధ్వంసం, భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడటం, తోటలు తగులపెట్టడం, బోర్లు ధ్వంసం చేయడం తదితర అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. డిజిపి తక్షణమే స్పందించి ఈ దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని, బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి'' అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.