ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో... అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. కాగా... ఈ సమావేశాల్లో వైసీపీ నేతలకు.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.

మేం తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 

వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణంపై హౌస్‌ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పేదలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.