అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ తొలిసారిగా భేటీ అయ్యింది. కమిటీ కన్వీనర్ యనమల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సభ్యులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్ తోపాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. 

సమావేశం అనంతరం మేనిఫెస్టో కమిటీ సభ్యుడు మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2019-24 ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రాథమికంగా చర్చించామని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నూటికి నూరుశాతం అమలు చేశామన్నారు. 

రాబోయే ఎన్నికల్లో ప్రజల మేనిఫెస్టోను రూపొందించి మరింత పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. తొలి భేటీలో ముఖ్యంగా ఐదు  అంశాలపై చర్చించినట్లు తెలిపారు. టీడీపీ మ్యానిఫెస్టోలో సంక్షేమం, యువత, మహిళ, మధ్యతరగతి వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 

ఐదు సెక్టార్లపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుటుంబ వికాసం కోసం మేనిఫెస్టోలో 15 అంశాలు, సమాజ వికాస కోసం 10 అంశాలు చేర్చనున్నట్లు తెలిపారు. ప్రజల తలసరి తలసరి ఆదాయం 3.78లక్షల కోట్లకు చేర్చాలన్నారు. 

జీఎస్‌డీపీ 24 లక్షల కోట్లకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. ఈనెల 25న మరోసారి హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు వెబ్‌సైట్ ప్రారంభించారు. WWw.Tdpmanifesto.com ద్వారా ప్రజల అభిప్రాయాలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు తెలిపారు. 

ఇతర పార్టీల మాదిరి కాకుండా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మ్యానిఫెస్టో తయారు చెయ్యనున్నట్లు చెప్పారు. ప్రజలకు న్యాయం చేసే పథకాలు అమల్లో ఉన్నాయని మరిన్ని పథకాలు, ఆలోచనలను తీసుకుని మార్చి 15లోగా మేనిఫెస్టో తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.