రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి.. కచ్చితంగా విజయం సాధిస్తానని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి అనీషారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా అనీషారెడ్డి పోటీచేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా.. మంగళవారం ఆమె నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆమె పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నుంచి గెలిచి.. ఆ గెలుపుని చంద్రబాబుకి కానుకగా ఇస్తానని అన్నారు. సమష్ఠి కృషితో పుంగనూరును గెలిచి చూపిద్దామని పిలుపునిచ్చారు.

ఇంతకీ ఎవరీ ఈ అనీషా రెడ్డి..?

కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు కె.రఘురామరెడ్డి కుమార్తె అనీషా రెడ్డి. అంతేకాదు వైసిపి ఎమ్మెల్యేగా గెలిచి టిడిపిలో చేరి మంత్రి అయిన అమరనాథరెడ్డికి ఈమె స్వయానా మరదలు కూడా కావడం గమనార్హం. 1992లో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్‌.రామకృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డి సోదరుడు ఎన్‌.శ్రీనాథరెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. ఈమె ఎల్ఎల్ బి చదివారు. పుంగనూరుకు వైసీపీ నుంచి సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా...ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్న చంద్రబాబు టీటీడీ పాలక మండలి సభ్యుడు బాబు రెడ్డి ఈ టికెట్ కోసం రేసులో నిలిచినా అనీషా అభ్యర్థిత్వానికే మొగ్గుచూపడం గమనార్హం.