వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు.

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఇందుకోసం గుడివాడ బయలుదేరిన టీడీపీ నేతలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గుడివాడ‌కు బయలుదేరిన టీడీపీ నేతలు దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్‌, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్యలను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. 

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాహనాన్ని కంకిపాడు టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు.. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఉంగటూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. గుడివాడ వెళ్లకుండా పామర్రులో పలువురు టీడీపీ నేతలను అడ్డుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 

గుడివాడ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత 
కొడాలి నానిపై గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు అయితే పోలీసులను తోసుకుంటూ కొందరు టీడీపీ నేతలు పోలీస్ స్టేసన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొడాలి నానికి వ్యతిరేకంగా పోలీసు స్టేషన్‌ ముందు టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తాడేపల్లిలో ఫిర్యాదు.. 
ఇదిలా ఉంటే.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతల బృందం శనివారం తాడేపల్లి పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న సహా టీడీపీ ప్రతినిధి బృందం కోరింది. కొడాలి నానిపై తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుంటే ప్రైవేట్ కేసులు పెడతామని టీడీపీ నేతలు చెప్పారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరించారు. కొడాలి నానిని త్వరలో గుడివాడ నుంచి తరిమికొడతామన్నారు.