తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీలు దాడుల విషయంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉదయం వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసి దాడులపై ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా డీజీపీని కలిసి వైసీపీపై ఫిర్యాదు చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చాకా.. తమ కార్యకర్తలపై దాడులు పెరిగాయని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 103 మందిపై దాడులు జరిగాయని, ఇద్దరిని హత్య చేశారని వారు ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని పోలీస్ స్టేషన్‌కు వెళితే.. పోలీసులు కేసు నమోదు కూడా చేయడం లేదన్నారు. ముందు మీరు ఏ పార్టీ అని అడిగిన తర్వాతే అక్కడి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని వారు ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. జగన్ సత్తా ఏంటో తెలిసిందని వర్ల రామయ్య అన్నారు. అరాచకాన్ని, విధ్వంసాన్ని ముఖ్యమంత్రి ప్రేమిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పల్నాడు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. హోంమంత్రి ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదని రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.