Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్టును ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురైన అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు.

TDP Leaders Meet Governor Abdul Nazeer in Visakhapatnam Over Chandrababu Arrest ksm
Author
First Published Sep 11, 2023, 11:20 AM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో గంటా శ్రీనివాసరావు, గండి బాజ్జీ, చిరంజీవిరావు తదితరలు ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతల బృందం.. గవర్నర్‌ను  కోరింది. గవర్నర్‌తో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గవర్నర్ వద్ద తాము ఏం చెప్పకముందే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నానని తమతో చెప్పారని అన్నారు. ఆయనకు కూడా సమాచారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని గవర్నర్ అన్నారని తెలిపారు. రాష్ట్రంలోని పరిణామాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు.  మీ జోక్యం అవసరమని చెబితే.. ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారని చెప్పారు. 

చంద్రబాబుపై సంబంధం లేని అక్రమైన కేసు పెట్టి జైలుకు తీసుకెళ్లారని మండిపడ్డారు. కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణమని అన్నారు. 48 గంటల పాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారని విమర్శించారు. చంద్రబాబు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరని అన్నారు. ఈ క్రమంలోనే ఒక దశలో అచ్చెన్నాయుడు ఉద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ వైసీపీకి మరణశాసనం అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలియజేసే హక్కు లేదా? అని డీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందని. విమర్శించారు. 

టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని.. జనసేనతో కలిసి పోటీ చేస్తే వైసీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదని.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో టీడీపీ నేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని ఈ కేసులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. కోర్టులను మేనేజ్ చేసుకునే శక్తే ఉంటే.. ఇంత చిన్న కేసులో చంద్రబాబు జైలుకు వెళ్తారా? అని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios