ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో నేతలు, కార్యకర్తలు ఢీలా పడిపోయారు. ఈ క్రమంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొన్ని సమావేశాలు జరగగా, ముఖ్య నేతలు కూడా మరికొన్నింటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ మేరకు కార్యకర్తలకు సమాచారం కూడా అందించారు.
 
అయితే, ఈ సమావేశానికి నేతలు, కార్యకర్తలు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనికి కారణం సమావేశాన్ని అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలనుకోవడమేనని సమాచారం. కోడెల ఆఫీసులో సమావేశం ఏర్పాటుపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దీంతో గురువారం సాయంత్రం టీడీపీ పాత కార్యాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ సమావేశాన్ని అందులోనే జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఎవరూ రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.