చంద్రబాబుని చంపేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన వాహనంపై కోడి గుడ్లు, రాళ్లతో దాడి కూడా జరిగింది. ఈ ఘటనపై టీడీపీ నేతలు మాట్లాడారు.

దేశంలో కొందరికే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉంటుందని.. అలాంటి వీఐపీ భద్రత చంద్రబాబుకి ఉన్నా.. విశాఖలో పోలీసుల సమక్షంలో ఆయనపై రాళ్లు,కోడిగుడ్లు, చెప్పులతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... విశాఖపట్టణంలో ప్రజా చైతన్య యాత్రకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకుని దాడులు చేయడం బాధాకరమన్నారు. అదికూడా అభంశుభం తెలియని కొందరు కూలీలకు డబ్బులిచ్చి తీసుకెళ్లి వైసీపీ నేతల కనుసన్నల్లో కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరివేయించారన్నారు.

 వందమంది అల్లరిమూకలపై అక్కడ ఉన్న పోలీసులు చర్యలు తీసుకోకపోగా... ప్రేక్షక పాత్ర పోషించడం మరింత బాధ కలిగిస్తున్నదన్నారు. జగన్‌ ప్రభుత్వం, జగన్‌ కుర్చీ శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే రాష్ట్రం  పరిస్థితి ఏంటన్నారు. 

Also Read పంతం నెగ్గించుకున్న పోలీసులు: ఎట్టకేలకు ఫ్లైటెక్కిన చంద్రబాబు...

వైసీపీ ముసుగులో పులివెందుల రౌడీలు వచ్చి విశాఖలో ఇది ట్రయల్‌ రన్‌ దాడి చూపించారన్నారు. మమ్ములను కాదన్నా... మేము చెప్పినట్లు వినకపోయినా ఇదే శాస్తి జరుగుతుంది.. చంద్రబాబుకే దిక్కులేదు... మీకెవరు దిక్కు అంటూ విశాఖ ప్రజలను బెదిరింపుకు ఈ దాడి చేశారన్నారు. 

చంద్రబాబును చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర సాగితే విశాఖలో వైసీపీ చేసిన భూదందా బయటకొస్తుందనే ఈ దాడులు చేయించి యాత్రను అడ్డుకున్నారన్నారు.