హైదరాబాద్: టీడీపీ ఎంపీ కేశినేని నానిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నాడు మహాధర్నా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్ట్  చేశారు.

 అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరులో ధర్నా దీక్షకు పెద్ద ఎత్తున రైతులు  ఆందోళనకు సిద్దమౌతున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికకు సంబంధించి ఈ నెల 27వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉంది.ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ ఆందోళనలను కొనసాగించనున్నారు. రేపు కేబినెట్ సమావేశం ఉన్నందున కేబినెట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రైతులు పోలీసులకు చెప్పారు. రోజు రోజుకూ రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. 

ఇవాళ కూడ పెద్ద ఎత్తున ఆందోళనలు  ఉన్న నేపథ్యంలో విజయవాడలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మహేశ్వరరావులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.అమరావతిలో కూడ పలువురు నేతలను కూడ పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. 

రైతులకు  బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాలు,ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు,డాక్టర్ల సంఘాలు మద్దతును ప్రకటించాయి. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురువారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.