గుంటూరు: గుంటూరు జిల్లా పొనుగుపాడులో రోడ్డుకు అడ్డగంగా గోడకట్టిన వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన పరిస్థితిని పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. 

రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన వైనాన్ని పరిశీలించేందుకు నిజనిర్థారణ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, శ్రావణ్ కుమార్ లు వెళ్లారు. 

గోడ దాటి అవతలవైపు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను కలిసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ పార్టీ సభ్యులతో మాట్లాడి వస్తామంటూ టీడీపీ నేతలు పోలీసులతో చెప్పారు.  

అయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వెళ్లొద్దని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ టీడీపీ నేతలు వినకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడకు టీడీపీ సభ్యులు తరలిరావడంతో వారిని ఒక గెస్ట్ హౌస్ కు తరలించారు.

టీడీపీ నేతల అరెస్ట్ ను నిరసిస్తూ పొనుగుపాడుకు చెందిన టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తమ నాయకులను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పొనుగుపాడులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ నేతలు ఇంటికి వెళ్లకుండా వైసీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా గోడకట్టారు. దాంతో ఇవతలివారు అవతలి వైపు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ అంశాన్ని మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. వైసీపీ దౌర్జాన్యాలకు ఇది పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే రాష్ట్రానికి ఏం సేవలు అందిస్తారంటూ చంద్రబాబు నిలదీశారు.