సీఎం జగన్ ది కొంగజపం... ఆయన తడిగుడ్డతో గొంతుకోసే రకం : మాజీ మంత్రి యనమల
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిసి లకు మేలు చేస్తానంటూ అబద్దపు వాగ్దానాలతో కొంగ జపం చేస్తున్నారని మాజీ ఆర్థిక మంత్రి యజమల రామకృష్ణుడు ఎద్దేవా చేసారు. తడిగుడ్డతో గొంతులు కోస్తూనే బిసిలకు తోడుగా ఉన్నానంటూ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా వున్నాయన్నారు. బీసీల ఆస్తులు లాక్కుని వారి సమాధులపై జగన్ రెడ్డి అవినీతి సౌధాల నిర్మించుకున్నారని యనమల మండిపడ్డారు.
బీసీలకు జగన్ రెడ్డి చేసిన మేలు కన్నా వారి నుండి దోచుకున్నదే ఎక్కువని యనమల ఆరోపించారు. వైసీపీ నేతల దోపిడీకి బలవుతున్నది బీసీలేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో జరిగిన భూ కుంభకోణాలు, భూ దోపిడీ, మైనింగ్ మాఫియాకు అధికంగా బలైంది బీసీలే అని అన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయాల్సింది పోయి.. బీసీల ఆస్తులను దుర్మార్గంగా లాక్కుంటున్నారని అన్నారు. జగనన్న కాలనీలు, పవర్ ప్రాజెక్టులు, పరిశ్రమలు అంటూ బలహీన వర్గాల వారి నుండి 12 వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని... భూములు కోల్పోయిన రైతులకు కనీస పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. బడుగు బలహీన వర్గాల వారి ఆస్తులను జగన్ లాక్కుంటున్నారని... వారి సమాధులపై అవినీతి సౌధాలు నిర్మించుకుంటున్నాడని యనమల మండిపడ్డారు.
అర్హత ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల్లో కోత కోస్తున్నారని యనమల అన్నారు. నాలుగేళ్లలో బీసీలకు జరిగిన అభివృద్ధి ఏంటి? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆఘమేఘాలపై బడుగు బలహీన వర్గాల ఇళ్లు ఖాళీ చేయించి రోడ్లు వేయించుకున్న ముఖ్యమంత్రి బీసీ కాలనీలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.75,760 కోట్లు దారి మళ్లించి బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ముఖ్యమంత్రి 28 సార్లు ఢిల్లీ వెళ్ళినా ఒక్కసారి కూడా జనగణన గురించి నోరు మెదపలేదని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం అందరూ ఉద్యమిస్తుంటే జగన్ రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారని యనమల అన్నారు.
Video 9 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్... ఇదీ ఏపీలో పరిస్థితి : సిపిఐ రామకృష్ణ
జగన్ రెడ్డి అరాచక విధానాలతో రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా నష్టపోతున్నారని మాజీ మంత్రి అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన వారిలో అత్యధిక శాతం బడుగు బలహీనవర్గాలవారేనని... న్యాయబద్దంగా వారికి చెల్లించాల్సిన కౌలు కూడా చెల్లించకుండా అరాచకాలతో వేధిస్తున్నారని అన్నారు. ఇటీవల బాపట్లలో బీసీ పిల్లాడిపై పెట్రోల్ పోసి తగులబెట్టేస్తే సీఎం గానీ, మంత్రులు, వైసిపి నాయకులు కనీసం స్పందించిన దాఖలాలు లేవన్నారు. నిన్నటికి నిన్న విజయనగరం జిల్లాలో బీసీ వర్గానికి చెందిన కృష్ణ మాస్టారుని వైసీపీ నేతలు కారుతో తొక్కించి, రాడ్లతో కొట్టి, కళ్లు పొడిచి చంపేస్తే నోరు మెదపలేదని... ఇలా వందలాది హత్యలు, వేలాది దాడులు చేయించిన జగన్ రెడ్డికి బీసీ అనే పదం పలికే అర్హత ఉందా? అని యనమల ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతలు కొండల్ని దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. కొండెక్కిన ధరల్ని తగ్గించడంపై చూపడం లేదంటూ యనమల ఎద్దేవా చేసారు. అసమర్ధత, అవినీతితో నిత్యావసర వస్తువుల ధరల్ని ఆకాశాన్నంటించి బడుగు బలహీన వర్గాలు పస్తులుండే పరిస్థితి కల్పించారన్నారు. ఒక వైపు ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు... మరోవైపు ధరలు పెంచి పేదల కొనుగోలు శక్తిని దెబ్బతీసి రోడ్డుపాలు చేశారన్నారు. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటూ.. పేదల్ని నిరుపేదలుగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. పేదలపై ప్రేమ ఉంటే.. ధరల సంక్షోభ సమయంలో అన్న క్యాంటీన్లు, రాయితీపై వస్తువుల పంపిణీ, రైతు బజార్లను పటిష్టం చేయడం వంటి కార్యక్రమాలు ఎందుకు అమలు చేయడం లేదు? అంటూ సీఎం జగన్, వైసిపి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.