అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాగరిక, అనాలోచిత పాలనలో రాష్ట్రం ఎంతలా దిగజారిపోతోందో నేడు ఉద్యోగుల జీతాల విషయంలో బట్టబయలైందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు క్లియర్ చేయకుండా, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా... వచ్చిన ఆదాయం, చేసిన అప్పుల ఆదాయం ఎక్కడకు పోతోంది జగన్ రెడ్డీ.? అని యనమల ప్రశ్నించారు. 

''జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది? జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల కోసం కూడా  అప్పులపైనే ఆధారపడటమంటే.. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయడం కాదా.? రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ అమలు చెయ్యమని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను వెనక్కి పంపుతుండడం వాస్తవం కాదా? ఈ పరిస్థితికి జగన్ రెడ్డి చేతకానితనం కారణం కాదా.?'' అని నిలదీశారు.

''జగన్ రెడ్డి ప్రభుత్వానికి గతేడాది కంటే ఆదాయం పెరిగినా అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 2020-21 ఫిబ్రవరి నాటికి రూ.79,191.58 కోట్లు అప్పులు చేసి దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా రికార్డు క్రియేట్ చేశారు. 2020 ఫిబ్రవరిలో స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం రూ.5,821.62 కోట్లు ఉండగా.. 2021 ఫిబ్రవరికి రెట్టింపు అయ్యి.. రూ.10,125.19 కోట్లకు పెరిగింది. ల్యాండ్ రెవెన్యూ ఆదాయం గత ఫిబ్రవరిలో రూ.19.72 కోట్లు ఉంటే అది 2021లో రూ.123.58 కోట్లు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో కేంద్రం నుండి 2020 ఫిబ్రవరిలో రూ.16,758.40 ఉండగా.. 2021లో రూ.26,458.60 కోట్లకు పెరిగింది. అంటే రూ.9700 కోట్లు ఈ ఏడాది కేంద్రం నుండి రాష్ట్రానికి అధనంగా వచ్చాయి. మొత్తం మీద గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జగన్ ప్రభుత్వానికి రూ.29,109.30 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. మరోవైపు కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున వచ్చిన  విరాళాలు, రుణాల ద్వారా సమకూర్చుకున్నారు'' అని వివరించారు. 
  
''ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై తలసరి అప్పు రూ.70 వేలకు చేర్చారు. ఈ ఏడాది 3 నెలల్లోనే రూ.73,812 కోట్ల అప్పు తేవడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్ల పాలనలో రూ.2.50లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన రుద్దారు. ఇంత అప్పులు చేసి, పన్నుల భారం పెంచినా.. రాష్ట్రంలో రూపాయి అభివృద్ధి జరగలేదు. గతంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులూ చెల్లించలేదు. తెచ్చిన అప్పులు.. కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమవుతున్నాయనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వెంటనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని యనమల డిమాండ్ చేశారు.