అవినీతి డబ్బు, అధికార బలంతోనే వైసీపీ గెలిచిందన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ.. ఎన్నికల్లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం హేయమన్నారు

అవినీతి డబ్బు, అధికార బలంతోనే వైసీపీ గెలిచిందన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ.. ఎన్నికల్లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం హేయమన్నారు.

ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలవడం దుష్టరాజకీయమంటూ యనమల దుయ్యబట్టారు. వైసీపీ గెలుపు ప్రజాభిమానంతో వచ్చింది కాదని రామకృష్ణుడు ఆరోపించారు. గెలిస్తే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం టీడీపీకి అలవాటు లేదని ఆయన తేల్చిచెప్పారు. వైసీపీ బాధితులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యనమల రామకృష్ణుడు భరోసా ఇచ్చారు. 

అంతకుముందు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. కొన్ని చోట్ల ప్రాణాలు పణంగా పెట్టి మరీ పార్టీకి అండగా నిలిచారని ఆయన తెలిపారు.

ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని .. వైసీపీ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని చంద్రబాబు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తే రాబోయే రోజుల్లో విజయం టీడీపీదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.