9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలు అన్నట్లుగా జగన్ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. హామీలు అమ‌లు చేయ‌ని జ‌గ‌న్‌పై గ్రామ‌గ్రామాన చ‌ర్చ జ‌రుగుతోంద‌ని యనమల హెచ్చరించారు.  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు (yanamala rama krishnudu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జ‌గ‌న్ (ys jagan) ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని ఆయ‌న మండిపడ్డారు. ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ది న‌వర‌త్నాలు కాదని, న‌వ మోసాలని యనమల సెటైర్లు వేశారు. జ‌గ‌న్ పాల‌న 9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. మూడేళ్ల‌లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం జ‌గ‌న్‌దేన‌ని రామకృష్ణుడు దుయ్యబట్టారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అవినీతిమ‌యం చేశారని ఆయ‌న ఆరోపించారు. హామీలు అమ‌లు చేయ‌ని జ‌గ‌న్‌పై గ్రామ‌గ్రామాన చ‌ర్చ జ‌రుగుతోంద‌ని యనమల హెచ్చరించారు. 

అంతకుముందు రేపల్లే రైల్వేస్టేషన్‌లో వివాహితపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో రోజుకో మర్డర్... పూటకో రేప్ జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు చూస్తే పరిస్థితి బీహార్ ను మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. తాజాగా రేపల్లెలొ వలసకూలీపై జరిగిన అత్యాచారమే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో తెలియజేస్తుంది'' అని లోకేష్ మండిపడ్డారు, 

''ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపురం గ్రామం నుంచి పొట్టచేతపట్టుకుని ఓ కుటుంబం రేపల్లెకు వలసవెళ్లింది. శనివారం రాత్రి 11:40 నిమిషాలకు రేపల్లె రైల్వే స్టేషన్ కు ట్రైన్ చేరుకోగా ముగ్గురు పిల్లలతో కలిసి దంపతులు ప్లాట్ ఫామ్ పై దిగారు. ఆ రాత్రి భర్త పిల్లలతో కలిసి మహిళ అక్కడే నిద్రపోతున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. భర్తపై దాడిచేసి మహిళపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు'' అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. 

''రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. గత నాలుగురోజులుగా గుంటూరు జిల్లాలో రోజుకో రేప్ జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎదురుదాడి మాని మహిళలపై నేరాలను అదుపుచేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మహిళలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లే భయానక పరిస్థితులు తలెత్తొచ్చు'' అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

''ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలి. హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాలవల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరం. పెంపకంలో తల్లుల తప్పుల వలనే ఘోరాలు జరుగుతున్నాయని స్వయంగా మహిళా హోంమంత్రే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలను పంపాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్జప్తిచేస్తోంది'' అని నారా లోకేష్ పేర్కొన్నారు