Asianet News TeluguAsianet News Telugu

దేవుడి భూములపై ఆ మంత్రి కన్ను... మీరే కాపాడాలి..: దేవాదాయ కమీషనర్ కు వర్ల రామయ్య లేఖ

గుడివాడ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల విలువచేసే దేవాలయ భూములపై ఓ మంత్రి కన్ను పడిందని... ఆ భుములు అన్యాక్రాంతం కాకుండా చూడాలంటూ దేవాదాయ కమీషనర్ కు వర్ల రామయ్య లేఖ రాశారు. 

tdp leader varla ramaiah writes a letter to endowment commissioner
Author
Vijayawada, First Published Sep 29, 2021, 5:04 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలోని దేవాలయాలకు చెందిన రూ.250కోట్ల విలువైన దేవాదాయశాఖ భూమిపై మంత్రి కొడాలి నాని కన్నేసారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ దేవుడిభూమికి శఠగోపం పెట్టడానికి మంత్రి సిద్ధమయ్యారని టిడిపి ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో దేవాదాయ భూములను మంత్రి కబ్జా చేయకుండా కాపాడాలంటూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కు టిడిపి నాయకులు వర్ల రామయ్య లేఖ రాశారు. 

వర్ల రామయ్య లేఖ యధావిధిగా: 

తేది. 29.09.2021
గౌరవనీయులైన దేవాదాయశాఖ కమిషనర్ గారికి
ఆంధ్రప్రదేశ్, అమరావతి.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నమస్కరించి వ్రాయునది. 

ఆర్యా!

విషయం: కృష్ణా జిల్లా గుడివాడలో ఆలయ భూముల అన్యాక్రాంతంపై - కొందరి అధికారుల అత్యుత్సాహం - ఆ స్థలంపై ఓ మంత్రి కన్ను - పత్రికల్లో ప్రచారం - తగిన చర్యలు తీసుకొనుట - గురించి
 
కృష్ణా జిల్లా గుడివాడలోని భీమేశ్వరస్వామీ ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయాలకు పట్టణ శివారులోని వెలివర్తిపాడులో సర్వే నంబర్ 272 లో 15.07 ఎకరాలు, సర్వే నంబర్ 294 లో 5.64 ఎకరాలు, యల్లయపాడులో సర్వే నంబరు 4 లో 4.83 ఎకరాలు భూములు ఉన్నాయి. 1942 నుంచి ఈ భూములు పై రెండు దేవాలయాల పరిధిలో ఉన్నాయి. గతంలో ఈ భూములను ఆక్రమించుకున్న వారి వద్ద నుంచి వాటిని విడిపించి దేవాదాయశాఖ ట్రైబునల్ ద్వారా వీటిని 2017 లో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. కానీ ప్రస్థుతం ఈ భూములపై అధికారపార్టీకి చెందిన ఒక మంత్రి కన్ను పడిందని పత్రికల్లో వార్తలు వచ్చినవి. భూములను మంత్రికి ధారదత్తం చేసేందుకు జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శస్తున్నట్లుగా ప్రకటించబడింది. మరీ ముఖ్యంగా జిల్లా జాయింట్ కలెక్టర్లలో ఒకరు ఆ మంత్రికి ఈ భూములు ధారదత్తం చేయడం కోసం ఎంతకైనా బరితెగించినట్లుగా తెలుస్తున్నది. 

దేవాదాయ భూముల కస్టోడియన్ గా ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత మీ మీదున్నది. మంత్రి సేవలో తరిస్తున్న అధికారులను కూడా కట్టడి చేసే భాధ్యత మీదే. ఈ గుడివాడ దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసన భాధ్యత కూడా మీదే. జిల్లా కలెక్టర్ ఈ భూముల విషయంలో జోక్యం కలిగించుకోకుండా ఆ మంత్రి, ఆయనకు వత్తాసు పలుకుతున్న జాయింట్ కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా జిల్లాలో ప్రచారం ఉంది. అజాగ్రత్తగా ఉంటే, అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు ఉన్నది. కావున తమరు దయచేసి, ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా, మంత్రి చేతిలో పడకుండా చూడవలసినదిగా విజ్జప్తి చేస్తున్నాను. 

ధన్యవాదములు

ఇట్లు

తమ విధేయులు,
(వర్ల రామయ్య)
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి

దీని నఖలు జిల్లా కలెక్టర్ గారికి పంపడమైనది. ఈ రోజు పేపర్ క్లిప్పింగ్ కూడా జత చేయడమైనది.

Follow Us:
Download App:
  • android
  • ios