టిడిపి జూమ్ మీటింగ్ లో వైసిపి నేతల చొరబాటు... భారీ కుట్రలో భాగమే..: సీఐడి ఏడిజిపికి వర్ల రామయ్య ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పదోతరగతి విద్యార్థులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి వైసిపి నాయకులు చొరబడటం వెనక భారీ కుట్ర దాగివుందంటూ వర్ల రామయ్య సిఐడి ఏడిజిపికి ఫిర్యాదు చేసారు.
అమరావతి: ఇటీవల ఏపీలో విడుదలైన పదో తరగతి ఫలితాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నారు. అతి తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదయి చాలామంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో వారికి ప్రతిపక్ష టిడిపి అండగా నిలిచింది. ఈ క్రమంలోనే విద్యార్థులతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ లో సమావేశమవడం... అందులోకి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరికొందరు వైసిపి నాయకులు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇలా టిడిపి చేపట్టిన జూమ్ మీటింగ్ లో వైసిపి నాయకులు చొరబడటం వెనక భారీ కుట్ర దాగివుందంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సిఐడి అడిషనల్ డీజీపీ కి పిర్యాదు చేసారు.
లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఫెయిలై తీవ్ర భయాందోళనలో ఉన్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారన్నారు. ఫెయిలైనందుకు తీవ్ర మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలకు జూమ్ మీటింగ్ ద్వారా భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. అలాంటి మీటింగ్ లో కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారన్నారు. ఇందులో కుట్రకోణం దాగివుందని వర్ల అన్నారు.
రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు. నేరపూరిత కుట్రతో లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ భగ్నం చేయాలని... రాజకీయ వైషమ్యాలు కల్పించాలని చూసారని అన్నారు. కాబట్టి అధికార వైసీపీ నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని.. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సీఐడి ఏడిజిపిని వర్ల రామయ్య కోరారు.
విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేష్ పై వైసిపి నాయకులు అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని వర్ల అన్నారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, కొత్తపల్లి రజనీలు విద్యార్థులతో జరుగుతున్న మీటింగ్ లోకి అక్రమంగా చొరబడ్డారన్నారు. గతంలో సైతం రాజకీయంగా వీరు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేసారు. ఎమ్మెల్యేలు నాని, వంశీ తమ నాయకడు లోకేష్ తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారన్నారు. జూమ్ మీటింగ్ లోకి వారి అక్రమ చొరబాటు భయాందోళన కల్గిస్తూ నేరపూరిత కుట్రగా కనిపిస్తోందని వర్ల రామయ్య అన్నారు.
ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలు ఇటీవల వెలువడిన రిజల్ట్స్ వరకు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష టిడిపి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పదో తరగతి ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవడం... దాదాపు రెండులక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే గతంలో అసలు పదోతరగతి పరీక్షలే వద్దని విద్యార్థులను రెచ్చగొట్టడం, ఆ తర్వాత పరీక్షలు, ఇప్పుడు రిజల్ట్స్ సమయంలో గందరగోళం సృష్టించి విద్యార్థుల జీవితాలతో టిడిపి రాజకీయం చేస్తోందని అధికార వైసిపి ఆరోపిస్తోంది. ఇలా పది పలితాలు రాజకీయ దుమారాన్ని రేపాయి.