ఆ బూతు వీడియోని ఏ ల్యాబ్‌కి పంపారు.. ఎవరు తీసుకెళ్లారు : గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వర్ల రామయ్య
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకి సంబంధించి టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మాధవ్ బూతు వీడియోని ఏ ల్యాబ్‌కు పంపారు.. ఏ అధికారి తీసుకెళ్లారంటూ రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.
వైసీపీ (ysrcp) ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla Madhav) న్యూడ్ వీడియో వ్యవహారం తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ప్రతిపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (varla ramaiah) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
‘‘ ముఖ్యమంత్రి గారూ! ఎంపీ మాధవ్ బూతు పురాణo ఘటనలో ఆ బూతు వీడియో ను ఫోరెన్సిక్ లాబ్ కు పంపామని సజ్జల చెప్తున్నారు. అయితే, ఏ లాబ్ కు పంపారు, ఏ పొలీసు స్టేషన్ నుండి ఏ అధికారి పంపారు, ఏఏ సెక్షన్ లతో కేసు నమోదు చేసారు? అసలు ఆ బూతు వీడియో ఫోరెన్సిక్ లాబ్ కు చేరిందా,లేదా? చేరితే, ఎప్పుడు? ’’ అంటూ వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇకపోతే.. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. ఆదవారం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. ఎక్కడ ఏం జరిగినా.. రోజా ఎక్కడ అని అడుగుతున్నారంటే.. టీడీపీ, జనసేనలకు తన మీద ఎంత ప్రేమ ఉందోనని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తనపై చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇబ్బంది కలిగిస్తే సీఎం జగన్ వదిలిపెట్టరని చెప్పారు. తమది మహిళ పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు. మహిళల అభివృద్ది కోసం పని చేసే ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు.
వీడియో నిజమో, కాదో తెలసుకోకుండా టీడీపీ విమర్శలు చేయడం తగదని అన్నారు. సీఎం జగన్ విచారణకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ హయాంలో మహిళపై లెక్కలేనని దాడులు జరిగిన ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని విమర్శించారు. నారాయణ స్కూల్స్‌లో ఆడపిల్లలు చనిపోతే ఒక్క కేసైనా పెట్టారా? అని ప్రశ్నించారు. మహిళలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరూ ఏ తప్పు చేసినా సీఎం జగన్ కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు.
Also Read:గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : ‘‘ మీ వాళ్లు చేయలేదా ’’ .. కుప్పంలో టీడీపీ నిరసనను అడ్డుకున్న సీఐ
ఇక, గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఏపీ మహిళా కమీషన్.. డీజీపీకి లేఖ రాసింది. ఇందుకు సంబంధించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డీజీపీని కోరింది. ఈ ఘటనలో త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు.