Asianet News TeluguAsianet News Telugu

కొన్నిరోజులు యాక్టీవ్.. కొన్ని రోజులు సైలెంట్, టీడీపీలోనైనా వుంటారా.. ఈసారి వంగవీటి రాధా దారెటు .?

వంగవీటి రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంగవీటి మోహనరంగా కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండు దశాబ్ధాల నుంచి రాజకీయాల్లో వుంటున్నారు. కానీ ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

tdp leader vangaveeti radha krishna to decide on future politics ksp
Author
First Published Dec 28, 2023, 4:04 PM IST

వంగవీటి రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంగవీటి మోహనరంగా కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండు దశాబ్ధాల నుంచి రాజకీయాల్లో వుంటున్నారు. కానీ ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత కాంగ్రెస్‌లో వున్న వంగవీటి రాధాకృష్ణ.. 2009 ఎన్నికలకు ముందు తన సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.  

కొద్దినెలలకు చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్‌గా వున్న రాధాకృష్ణ అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు , ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో కీలకమైన యువజన విభాగానికి రాధాను అధ్యక్షుడిగా నియమించారు జగన్. అయితే అనూహ్యంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ. ఈ నిర్ణయం రాధా రంగా అభిమానులను విస్మయానికి గురిచేసింది. రంగా హత్య వెనుక టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు వున్నారని ఇప్పటికీ ఆయన అభిమానులు ఆరోపిస్తూ వుంటారు. అలాంటి రంగా గారి అబ్బాయి తెలుగుదేశంలో చేరడం ఏంటంటూ ప్రశ్నించారు. 

2019 ఎన్నికల్లో పోటీ చేయని రాధా.. పార్టీ తరపున ప్రచారంతో పాటు ప్రత్యేకంగా హోమం చేయించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ రాధా సైలెంట్ అయ్యారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్ధతు పలికిన ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తళుక్కున మెరిశారు. మళ్లీ యధావిధిగా సైలెంట్ . రాధా విజయవాడ సెంట్రల్ సీటు అడగ్గా.. దానికి టీడీపీ హైకమాండ్ నిరాకరించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. బొండా ఉమా ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతూ వుండటంతో మరో నియోజకవర్గం కేటాయిస్తామని పెద్దలు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. 

ఈ పరిణామాలతో నొచ్చుకున్న రాధాకృష్ణ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా కథనాలు వెల్లువెత్తాయి. తిరిగి వైసీపీ గూటికి చేరుతారనే ప్రచారం జరిగినా అది అవాస్తవమని తేలింది. ఇలాంటి పరిస్ధితుల్లో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ స్వయంగా బెజవాడలోని రాధా ఇంటికి వెళ్లి సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. మనోహర్‌తో భేటీ అయిన నాటి నుంచి రాధా జనసేన తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారం మొదలైంది. ఇంతలో రాధాకృష్ణ పెళ్లి చేసుకోవడంతో పొలిటికల్‌గా పూర్తిగా నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. 

మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమ అదృష్టం ఈసారి ఎలా వుందో పరీక్షించుకోవాలని పాత , కొత్త నేతలు తహతహలాడుతున్నారు. తమకు పట్టున్న ప్రాంతంలో సీట్లు దక్కించుకోవాలని పైరవీలు, లాబీయింగ్‌లు చేస్తున్నారు. మరి రాజకీయంగా బలమైన కుటుంబానికి, శక్తివంతమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా వున్న వంగవీటి రాధాకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. పేరుకు టీడీపీలోనే వున్నా జనసేన, వైసీపీ నాయకులతో రాధా ఫ్రెండ్‌షిప్ చేస్తుండటంతో ఆయన మనసులో ఏముందనేది బయటకు రావడం లేదు. 

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం కాపుల చుట్టూనే తిరుగుతు వుండటంతో రాధాకున్న క్రేజ్‌ను సొంతం చేసుకోవాలని టీడీపీ, వైసీపీ, జనసేనలు పావులు కదుపుతున్నాయి. ఆయన వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికేందుకు జనసేన, వైసీపీలు కాచుకుని కూర్చొన్నాయి. దీనికి తోడు ఏపీలో భూస్థాపితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా రాధాకు ఆఫర్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాధాకృష్ణకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు కోరుకున్న స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హస్తం పార్టీ నుంచి రాయబారం వెళ్లినట్లుగా బెజవాడలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios