వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత. తనపై ప్రచారం ఆపకుంటే ఇంటికొచ్చి తాట తీస్తానని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSRCP), టీడీపీ (tdp) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటేసి ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత... (vangalapudi anitha) వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై (nallapareddy prasanna kumar reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తనపై తప్పుడు ప్రచారం ఆపకపోతే.. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికొచ్చి మరీ ఆయన తాట తీస్తానని అనిత హెచ్చరించారు.
తన క్యారెక్టర్ గురించి మరోమారు మాట్లాడితే ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం మీడియా ముందు పెడతానంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాటలకు, బెదిరింపులకు భయపడేది లేదని అనిత స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే.. వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి వారికి బడిత పూజ చేస్తామని అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటిని ఎవరికి రాసిచ్చారో దమ్ముంటే చెప్పాలని అనిత సవాల్ విసిరారు.
చంద్రబాబు (chandrababu) సీఎం అవ్వగానే మహిళలను అవమానించిన వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి బడిత పూజ చేస్తామని ఆమె హెచ్చరించారు. టిడిపి పునాదిపై రాజకీయ జీవితాన్ని నిర్మించుకుని చంద్రబాబు చావును కొరతారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిత్వానికి తన వ్యక్తిత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గం లో పొలాలకు చెరువులకు నీళ్లు ఇవ్వాలంటే ప్రజల దగ్గర కప్పం వసూలు చేస్తున్నారని, అది ఆయన క్యారెక్టర్ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో నగరి ఎమ్మెల్యే రోజాపైనా (ragari) విమర్శలు చేశారు వంగలపూడి అనిత. మహిళా సంక్షేమం, మహిళా సాధికారత పై బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. జబర్దస్త్ ప్రాసలు చూపించడం కాదని.. ఆమెకు నిజంగా ధైర్యం ఉంటే అమరావతి మహిళల మధ్యకు వచ్చి మహిళా సంక్షేమంపై మాట్లాడాలని సవాల్ విసిరారు. రోజా నగిరిలో పోటీ చేస్తే డిపాజిట్ తెచ్చుకోగలరా అంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు.
