ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనితపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొంతకాలంగా మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనితపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొంతకాలంగా మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు. ఆడపిల్లలలపై అఘాయిత్యాలు జరగకుండా జరగకుండా తల్లులే జాగ్రత్తపడాలని తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అనిత.. తల్లులను హోం మంత్రి కించపరుస్తున్నారని మండిపడ్డారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచారం ఘటన.. ఏ తల్లి పెంపకం తప్పో హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు.
వైసీపీ చేతగాని పాలన వల్ల జరుగుతున్న ఘటనలను.. తల్లుల పెంపకంపై నెట్టే స్థాయికి దిగజారారని అని అన్నారు. సీఎం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన అత్యాచార ఘటనలపై కూడా స్పందించరా అని ప్రశ్నించారు. 9 నెలల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతుంటే అది కూడా తల్లులు తప్పేనా అని ప్రశ్నించారు.
‘‘మహిళలపై అఘాయిత్యాలు ఆపడం చేతకాక అండగా నిలబడిన వారికి నోటీసులు ఇచ్చారని, హత్యాచారంకు గురైన మహిళకు అక్రమసంబంధం అంటగట్టారు. ఇప్పుడేమో ఏకంగా తల్లులను తప్పు పడుతున్నారు. రేపు తల్లులే చేయిస్తున్నారు అంటారా? అంటే విజయమ్మ బాగా పెంచి ఉంటే జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో వుండేవాడు కాదని మీ అభిప్రాయమా?’’ అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రస్తుత హోం మంత్రి కన్నా.. గతంలో పనిచేసిన హోం మంత్రి బెటర్ అనిపిస్తుందన్నారు. ఆమె కనీసం రాసిచ్చిన స్ట్రిప్ట్ అయినా చదివేవారని అన్నారు.
ఇక, శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత.. ఆడపిల్లలలపై అఘాయిత్యాలు జరగకుండా జరగకుండా తల్లులే జాగ్రత్తపడాలని కోరారు. తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందన్నారు. తల్లి కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. మహిళా పక్షపాతి అయినా తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఇలాంటి కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. తాళ్లపూడిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మూడు రోజుల వరకు కేసు నమోదు చేయలేదు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఈ విషయంలో విచారణకు ఆదేశించామన్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టీడీపీ హయాంలోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. అయితే అప్పుడు వారు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కేసులు వెలుగులోకి రాలేదని మంత్రి వనిత వివరించారు.
పనులకు వెళ్లిన కారణంగా పిల్లలను తాము రోజంతా చూసే సమయం దొరకదని కొందరు తల్లులు చెప్పే పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారరు. ఆడపిల్లల విషయంలో తండ్రి కంటే తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుందని Andhra Pradesh హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.తల్లిగా మనకు మనం సంరక్షణ ఇస్తూ పిల్లలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు పిల్లలపై ఏదైనా అఘాయిత్యం జరిగితే న్యాయం జరగాలని పోరాటం చేస్తామన్నారు.
తల్లి పాత్ర పోషించకుండా పోలీసులపైనో, ప్రభుత్వంపైనో నిందలు వేయడం సరైంది కాదన్నారు. తల్లిగా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలని Home Minister వనిత కోరారు. ఏదైనా సమయంలో పిల్లలకు ఇతరులతో ఇబ్బందులు కలిగితే ఆ సమయంలో పోలీసుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. పిల్లలు పెరిగే వాతావరణం కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగేందుకు కారణమౌతుందని వనిత అభిప్రాయపడ్డారు. అయితే హోం మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
