సొంత తల్లి విజయమ్మ, చెల్లెళ్లు షర్మిల,సునీతను మోసం చేసినట్లే కట్టుకున్న భార్య భారతిని జగన్ రెడ్డి మోసం చేయడం ఖాయమని.., ఆయన బాధితుల జాబితాలో ఆమెకూడా చేరుతుందని టిడిపి నాయకురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేసారు.   

అమరావతి: ఏపీ సీఎం జగన్ రెడ్డి (YS Jagan) అధికారం, ధనదాహం కోసం ఎవరినైనా ‎మోసం చేస్తారని... చివరకు చంపేందుకు సైతం వెనుకాడరని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangalapudi anitha) సంచలన వ్యాఖ్యలు చేసారు. నరనరాన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని కల్గివున్న ఆయన అవసరమైనప్పుడు ఎవరినైనా మోసం చేస్తారని ఆరోపించారు. రంగులుమార్చే ఊసరవెళ్లి సైతం సిగ్గుపడేవిధంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అనిత విరుచుకుపడ్డారు. 

''గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‎అధికారం కోసం ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని అబద్దాలు ఆడారు... మహిళల బుగ్గలు, తలలు నిమిరారు... మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక అదే మహిళల మానప్రాణాలు పోతున్నా కనీసం స్పందించటం లేదు. ఆడబిడ్డల ఆక్రందనలు వినసొం‎పైన సంగీతంలా భావించి ఆనందిస్తున్నట్లున్నారు'' అని అనిత మండిపడ్డారు. 

''జగన్ జైల్లో ఉన్నపుడు అన్నకోసం షర్మిల (ys sharmila) కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నికల ప్రచారం చేసింది. కానీ వైసిపి అధికారంలోకి వచ్చాక ఈమెకు ఏ పదవీ ఇవ్వకుండా ద్రోహం చేశారు. చెల్లెలు రాజకీయంగా దరిదాపుల్లో కూడా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్ధితి కల్పించారు. ఇక కొడుకు కోసం విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకుని, కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరురా తిరిగింది, కానీ ఇప్పుడు ఆమె ఏపీకి రావాలన్నా జగన్ అనుమతి కావాలి'' అని అనిత సంచలన వ్యాఖ్యలు చేసారు.

''బాహుబలిని ఎందుకు చంపారో తెలియడానికి రెండేళ్లు పట్టింది. కానీ బాబాయిని అబ్బాయి ఎందుకు చంపించారో ఇప్పటి దాకా తెలియలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు వివేకా హత్య(viveka murder)పై సీబీఐ (cbi) ఎంక్వైరీ కావాలని... సునీతకు న్యాయం జరగాలని ప్రతిపక్షంలో వుండగా జగన్ కోరారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక సీబీఐ ఎంక్వైరీ వేగవంతం చేయకపోగా అసలు ఎంక్వైరీనే వద్దన్నారు. ఇది సునీతకు ద్రోహం చేయటం కాదా? సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?'' అని నిలదీసారు. 

''ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుందా అంటూ మాట్లాడిన జగన్ నేడు సీబీఐ చార్జీషీట్ పై ఏం సమాధానం చెబుతారు? సొంత చెల్లిని, తల్లిని మోసం చేసిన జగన్ రెడ్డి కట్టుకున్న భార్యను మోసం చేయడని గ్యారంటీ ఏంటి? జగన్ రెడ్డి అక్రమాస్తులు భారతి రెడ్డి పేరు మీదే ఉన్నాయి. ఆమె సారధ్యంలోని సాక్షిలోనే తప్పుడు రాతలు రాయిస్తున్నారు, జగన్ చేసిన పాపాలు, అన్యాయాలు, ధనదాహాయానికి భారతి రెడ్డి సైతం కోర్టుల చుట్టూ తిరగక తప్పదు'' అని అనిత పేర్కొన్నారు.

''గత ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని భారతి రెడ్డి కూడా ‎ప్రచారం చేశారు. అయితే అసెంబ్లీలోనే సాక్షిలో తప్పు రాశారన్న జగన్ ఒప్పుకున్నాడు... భవిష్యత్ లో ఏదైనా విషయంలో భారతి రెడ్డి (ys bharati) బలిచేయడని నమ్మకమేంటి? జగన్ రెడ్డి పట్ల భారతి అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఆమె కూడా జగన్ రెడ్డి బాధితుల జాబితాలో చేరటం ఖాయం'' అని హెచ్చరించారు. 

''సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలు ఆలోచించాలి. మద్యంపై వచ్చిన అక్రమ ఆదాయంలో వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లు కొనచ్చని జగన్ అనుకుంటున్నారేమో... కానీ మహిళలు డబ్బులకు ఆశపడరు. ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే చూస్తు ఊరుకోరు... వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే... అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి పాలనలో బాధితులైన మహిళందరితో పాటు జగన్ ‎సొంత చెల్లెళ్లకు కూడా చంద్రబాబు న్యాయం చేస్తారు'' అని టిడిపి నాయకురాలు అనిత సంచలన వ్యాఖ్యలు చేసారు.