Asianet News TeluguAsianet News Telugu

అడ్డుకుంటే దాడులు... వైసిపి గూండాల అండతో రెచ్చిపోతున్న మట్టిమాఫియా: డిజిపికి తెనాలి శ్రవణ్ లేఖ

టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై దాడికి పాల్పడిన మట్టి మాఫియా సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్  డిజిపికి లేఖ రాసారు. 

tdp leader tenali sravan kumar writes letter to ap dgp over sand mafia
Author
Guntur, First Published Jun 30, 2022, 4:47 PM IST

గుంటూరు : తెలుగుదేశం పార్టీ నాయకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై దాడికి పాల్పడిన మట్టిమాఫియాపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పోలీసులను కోరారు. అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించిన వివరాలు, ఫోటోలను జతచేస్తూ రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి శ్రవణ్ లేఖ రాసారు. పెదకాకానిలో దూళిపాళ్ల నరేంద్రపై మట్టిమాఫియా చేసిన దాడిని ఖండించిన శ్రవణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కోరారు. 

''రాష్ట్రంలో మట్టి మాఫియా విచక్షణారహితంగా చెరువులను తవ్వేస్తున్నారు. టిడిపి నేతలు పిర్యాదు చేస్తున్నప్పటికీ అక్రమ త్రవ్వకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంతమంది అధికారులు పోలీసులతో కుమ్మక్కై వైసీపీ నేతల అండదండలతో మట్టి మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు'' అని డిజిపి దృష్టికి తీసుకెళ్ళారు శ్రవణ్. 

''గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడి గ్రామంలోని తాగునీటి చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టిపెట్టండి. అనుమర్లపూడి చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు టిడిపి నేత ధూళిపాళ నరేంద్ర 13 జూన్ 2022న వెళ్ళారు. కానీ మట్టి మాఫియా, అధికార వైసీపీ గూండాలు నరేంద్రపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. ఇలా వైసీపీ గూండాల అండతో మట్టిమాఫియా పట్టపగలే దాడి చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు'' అని డిజిపికి వివరించారు. 

''అక్రమ మట్టి త్రవ్వకాలకు నిరసనగా నరేంద్ర 2022 జూన్ 20న అనుమర్లపూడి చెరువు వద్ద శాంతియుతంగా సమావేశమయ్యేందుకు పిలుపునిచ్చారు. కానీ నరేంద్ర చేపట్టిన శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు దాదాపు 450 మంది పోలీసులను మోహరించారు. నరేంద్ర అనుమర్లపూడికి చేరుకోగా పోలీసులు లాఠీచార్జ్ చేసిమరీ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆర్టికల్ 19(1)(బి) ప్రకారం ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఆర్టికల్ 19(1)(ఎ) లో ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రంను, భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు తీవ్రంగా ఉల్లంఘించారు'' అని పేర్కొన్నారు. 

''పోలీసుల తీరుతో మట్టి మాఫియా, వైసిపి నాయకులు, పోలీసుల మధ్య ఉన్న బంధాన్ని బహిరంగపర్చింది. భావితరాల కోసం సహజ వనరులను కాపాడుకోవాలి. ప్రాథమిక హక్కులు కాపాడటంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోండి'' అని శ్రవణ్ కుమార్ డిజిపిని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios