అమరావతి: రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తాను ఐపిఎస్ అన్న విషయం మరచి వైపిఎస్ అధికారిలా ప్రవర్తిస్తున్నారని  టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలు, విగ్రహాల విధ్వంసంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని డిజిపి మాట్లాడుతున్న తీరే ఇందుకు నిదర్శనం అన్నారు. 

 రాష్ట్రంలో టిడిపి బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని సుధాకర్ రెడ్డి తెలిపారు. డిజిపి ఇండియన్ పోలీసు సర్వీసు(ఐపిఎస్)ను వైఎస్ఆర్ పార్టీ సర్వీసు (వైపిఎస్)గా భావిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. వరుసగా విగ్రహాల  విధ్వంసం జరుగుతుంటే నియంత్రించడం మాని ప్రతి పక్షాలు కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి అనడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వుందన్నారు.   

read more  సీఎం, డీజీపీలు ఉన్న ప్రాంతాల్లోనే ఇలాంటి దారుణమా?: అచ్చెన్నాయుడు ఫైర్

డిజిపి సవాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు, భక్తులు, పౌరుల్ని బెదిరించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. డిజిపి  మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరగుతున్న విధ్వంసాలపై తాము చేపట్టిన చర్యలను వివరిస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. అయితే అధికార పార్టీ కార్యకర్తలా ప్రభుత్వ వైఫల్యాలను వెనుకేసుకుని రావడం ఏమాత్రం తగదని హితవు పలికారు. 

విగ్రహాల విధ్వంసాల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉన్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబని సుధాకర్ రెడ్డి నిలదీశారు. గత ఏడాది జనవరి నుంచి 44 కేసులు నమోదయ్యాయన్న డిజిపి సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలన్నారు. ప్రతిపక్షాలపై  కుల, మతాల బురద చల్లే ప్రయత్నం చేస్తున్న డిజిపి తాను మతం మారినా రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చెశారు. డిజిపి ఇతర అధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై నిందలు మోపడం మాని బాధ్యతతో పని చేయాలని సుధాకర్ రెడ్డి కోరారు.