ప్రొద్దుటూరులో బీసీ నేత, చేనేత నాయకుడు నందం సుబ్బయ్య హత్య దుర్మార్గమన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి . వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన మండిపడ్డారు.

సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రజాస్వామ్యం ఉందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మొన్న గండికోట పరిహారంలో అవినీతిని ప్రశ్నించాడని సొంత పార్టీ కార్యకర్త గురుప్రతాప్ రెడ్డిని పట్టపగలే చంపేశారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

Also Read:సుబ్బయ్య హత్య.. ఏం జరిగిందో కమీషనర్ చెప్పాలి: చంద్రబాబు డిమాండ్

తాజాగా బీసీ నేత సుబ్బయ్యను బలితీసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చాడనే సుబ్బయ్యను చంపారని సోమిరెడ్డి ఆరోపించారు.

జగన్ ప్రభుత్వంలో పౌరులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకుల అరాచకాలపై ప్రజల తిరుగుబాటు ఖాయమని సోమిరెడ్డి జోస్యం చెప్పారు.