వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం భగ్గుమన్నారు. 

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి (somireddy chandramohan reddy) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రం ఇచ్చే అదనపు అప్పుల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగిస్తారా? అని ఆయ‌న నిల‌దీశారు. మీట‌ర్లు పెడితే మీకేం న‌ష్ట‌మని ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి అంటున్నారని, మ‌రి మీట‌ర్లు పెట్ట‌క‌పోతే మీ తాత సొత్తేమైనా పోతుందా? అని సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రైతుల త‌ర‌ఫున పోరాడ‌డానికి సిద్ధ‌మ‌ని చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. గత శుక్రవారం వ్య‌వ‌సాయ రంగానికి ఇస్తున్న విద్యుత్‌పై వైసీపీ అధినేత (ysrcp) , ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క్యాంపు కార్యాల‌యంలో వ్య‌వ‌సాయ శాఖ‌పై స‌మీక్ష చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో త్వ‌ర‌లోనే వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు (agricultural motors) ఏర్పాటు చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌కటించారు. ఈ దిశ‌గా శ్రీకాకుళం జిల్లాలో చేప‌ట్టిన‌ పైల‌ట్ ప్రాజెక్టు విజ‌య‌వంతం అయ్యిందని తెలిపారు. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల ఏర్పాటు వ‌ల్ల నాణ్య‌మైన విద్యుత్ అందుతుందన్న జ‌గ‌న్‌... రైతుల‌కు మెరుగైన విద్యుత్ ఇవ్వ‌గ‌లమ‌ని పేర్కొన్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే సాగు మోటార్ల‌కు మీట‌ర్ల‌పై విప‌క్షాలు దుష్ప్ర‌చారం చేస్తున్నాయ‌ని సీఎం మండిపడ్డారు.

సమీక్షలో భాగంగా రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై జ‌గ‌న్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... జూన్‌ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. అదే నెలలో 3 వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామ‌ని, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. 

ALso Read:వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. నీకొచ్చిన ఇబ్బందేంటీ : చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి చురకలు

ఇకపోతే.. ఇటీవల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్లపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. మీటర్లు మంచివే అయితే నీ పొలానికి పెట్టుకో అంటూ మంత్రి పెద్దిరెడ్డికి చురకలు వేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దని జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు హెచ్చరించారు. వ్యవసాయానికి మీటర్లు పెడితే ప్రమాదమని భావించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వాటిని తొలగించారని.. ఇప్పుడు మీటర్లు పెడితే రైతులకు లాభమని వైసీపీ నాయకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడి, అప్పుల కోసమే రాష్ట్రంలో మీటర్లు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

దీనికి గట్టిగానే కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) . వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. రైతులకు ఏ రోజునా మేలు చేయలేదన్నారు. రైతులు మోటార్లకు మీటర్లు పెడితే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ రోజు కుప్పం రైతులకు ఏ తాళ్లు బిగించావంటూ చంద్రబాబును ప్రశ్నించారు. రూ.500 కోట్లు పెట్టివుంటే హంద్రీనీవా నీళ్లు కుప్పానికి వెళ్లుండేవని పెద్దిరెడ్డి చురకలు వేశారు. ఏపీలో 75 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని రామచంద్రారెడ్డి తెలిపారు.