వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. నీకొచ్చిన ఇబ్బందేంటీ : చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి చురకలు
వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెడతామంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటరిచ్చారు. మోటార్లకు మీటర్లు పెడితే నీకొచ్చిన ఇబ్బంది ఏంటంటూ చురకలు వేశారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు (farmers) వైసీపీ ప్రభుత్వం (ycp govt) ఉరి తాళ్లు బిగిస్తోందన్న టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) . వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. రైతులకు ఏ రోజునా మేలు చేయలేదన్నారు. రైతులు మోటార్లకు మీటర్లు పెడితే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ రోజు కుప్పం రైతులకు ఏ తాళ్లు బిగించావంటూ చంద్రబాబును ప్రశ్నించారు. రూ.500 కోట్లు పెట్టివుంటే హంద్రీనీవా నీళ్లు కుప్పానికి వెళ్లుండేవని పెద్దిరెడ్డి చురకలు వేశారు. ఏపీలో 75 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇకపోతే.. ఇటీవల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్లపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. మీటర్లు మంచివే అయితే నీ పొలానికి పెట్టుకో అంటూ మంత్రి పెద్దిరెడ్డికి చురకలు వేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దని జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు హెచ్చరించారు. వ్యవసాయానికి మీటర్లు పెడితే ప్రమాదమని భావించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వాటిని తొలగించారని.. ఇప్పుడు మీటర్లు పెడితే రైతులకు లాభమని వైసీపీ నాయకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడి, అప్పుల కోసమే రాష్ట్రంలో మీటర్లు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Also Read:సాగు మోటార్లకు మీటర్లపై జగన్ ప్రకటన ... రైతులకు ఉరితాడేనన్న రైతు సంఘం
కాగా.. గత శుక్రవారం వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్‌పై వైసీపీ అధినేత (ysrcp) , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) కీలక ప్రకటన చేశారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు (agricultural motors) ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న జగన్... రైతులకు మెరుగైన విద్యుత్ ఇవ్వగలమని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సాగు మోటార్లకు మీటర్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
సమీక్షలో భాగంగా రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై జగన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన జగన్... జూన్ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామని చెప్పారు. అదే నెలలో 3 వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.