నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ చెడిందో తెలియదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రూ.2కోట్ల20లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు, రూ.1600కోట్లతో వ్యాక్సిన్లు కొనలేరా? అని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు ఎందుకు మూసేశాడో తెలియడంలేదని నిలదీశారు. 

తమిళనాడులో స్టాలిన్ అమ్మక్యాంటీన్లు కొనసాగుతాయని చెప్పారు. అమ్మక్యాంటీన్లపై దాడులకు పాల్పడిన తన పార్టీ కార్యకర్తలపై స్టాలిన్ కేసులు పెట్టించారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  చెప్పారు. పేదల ఆకలి, ఆరోగ్యం విషయంలో జగన్‌కి పంతాలు తగవని చెప్పారు. హైదరాబాద్‌లో రాష్ట్రవాసులకు వైద్యం అందేలా జగన్‌ చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  డిమాండ్ చేశారు. 

చంద్రన్న బీమా నిలిపేసిన విషయం ముఖ్యమంత్రికి తెలుసా?అని ప్రశ్నించారు.  పేదకుటుంబాలకు రూ.2లక్షలిస్తే, ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదని చెప్పారు.  కుటుంబంలో 18ఏళ్లు పైబడినవారు ఎందరు చనిపోయినా, వారికి రూ.2లక్షల చంద్రన్నబీమా అందించాలని కోరారు. 

ఆక్సిజన్ నిల్వలపై దృష్టిపెట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేస్తున్నా అన్నారు. రాజకీయాలు, కక్షసాధింపులను పక్కనపెట్టి, ప్రజలను కాపాడటంపైనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టిపెట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు.