కర్నూల్: కౌంటింగ్‌కు ఒక్క రోజు ముందు కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి బుధవారం నాడు ఉదయం దారుణంగా హత్యకు గురయ్యాడు. శేఖర్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుడుగా చెబుతున్నారు.

డోన్ మండలం తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డిని  ప్రత్యర్థులు బండరాయితో కొట్టి చంపారు.  ఈ ఘటనతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.శేఖర్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాలకు సన్నిహితుడని పోలీసులు చెబుతున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో శేఖర్ రెడ్డి కూడ టీడీపీకి మద్దతుదారుడుగా మారాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

బుధవారం నాడు బైక్‌పై వెళ్తున్న శేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటనతో రాజకీయాలకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. వ్యక్తిగత వివాదమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. శేఖర్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఆయన అనంతపురం నుండి స్వగ్రామానికి వచ్చాడు.