పరిటాల కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో వున్నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మాత్రం అండగా ఉంటుందని పరిటాల శ్రీరామ్ హామీ ఇచ్చారు.
అనంతపురం: ఇప్పటికే తనపై ఆరు కేసులు పెట్టారని... ఇలా అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్. పరిటాల కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో వున్నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మాత్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం గ్రామాల్లో కేసులు పెట్టి భయపెట్టి ఉండవచ్చు... కానీ అదే గ్రామాల ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయని శ్రీరామ్ హెచ్చరించారు. ముష్టికోవెల గ్రామంలో టిడిపి కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఇలా ప్రశాంతంగా వున్న గ్రామాల్లో కూడా అశాంతి రేపుతున్నారని శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
వైసిపి నాయకులు ఢాబాల్లో ఏసి గదులు ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పక్కనే వున్న కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని... ఇలా పెద్ద రాకెట్ నడిపిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కలెక్టర్ పేరును వాడుకుని బెదిరింపులకు గురిచేసే వైసీపీ నేతలు కూడా వున్నారని శ్రీరామ్ ఎద్దేవా చేశారు.
టిడిపి అధ్యక్షులు చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అయ్యిందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో పాలన జరగడం లేదు.. స్టార్టప్ కంపెనీలాగా ఉందని పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు.
