Asianet News TeluguAsianet News Telugu

ఇంత అన్యాయమా, చీమ కుట్టినట్లు కూడా లేదా.. పంచుమర్తి అనురాధ

అమరావతిలో నిర్మాణాలను ఏం చేయాలో ఆలోచిస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు.  సీనియర్ మంత్రిగా ఆయన అలా  మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు.

TDP Leader Panchumarty Anuradha Comments on Three Capital
Author
Hyderabad, First Published Aug 18, 2020, 12:55 PM IST

రాజధాని మార్పు విషయంలో.. ఏపీసీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధా మండిపడ్డారు. జగన్ తీసుకున్న నిర్ణయానికి వైసీపీ నేతలు తానా అంటే తందానా అని తలలు ఊపుతున్నారని ఆమె ఆరోపించారు.

బుర్రతో ఆలోచించే శక్తి వైసీపీ నేతలకు ఉందా లేదా అని ప్రశ్నించారు.  ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతోంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదంటూ మండిపడ్డారు.  రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి సేవ చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

అమరావతిలో నిర్మాణాలను ఏం చేయాలో ఆలోచిస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు.  సీనియర్ మంత్రిగా ఆయన అలా  మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు. తల్లిదండ్రులను చంపేసి తద్దినం బాగా చేస్తానన్నట్టు బొత్స వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అమరావతిని చంపేసి ఆ నిర్మాణాలను ఏం చేయాలో ఆలోచిస్తారా అని అడిగారు.

ఉత్తరాంధ్రకు రాజధాని ఇస్తే కష్టాలు తొలగిపోతాయా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి టీడీపీ హయాంలో అన్ని చర్యలు తీసుకోవడం వల్ల వలసలు ఆగాయని గుర్తు చేశారు.  విశాఖలో చంద్రబాబు గారు పరిశ్రమల కోసం కట్టిన బిల్డింగ్ లలో రాజధాని పెడతామని చెప్పడమేంటన్నారు.

 అలా చెప్పుకోడానికి సిగ్గుగా అనిపించడంలేదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విశాఖలో మూడు సమ్మిట్ లు పెట్టామన్నారు. మీరు ఏడాదిన్నరలో ఏం చేశారు? ఒక్క కేంద్రమంత్రి విశాఖకు రాలేదన్నారు.

 నాడు చంద్రబాబు కేంద్రమంత్రులను రప్పించి అభివృద్ధిలో భాగస్వాములను చేశారన్నారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే అదానీ డేటా సెంటర్ , ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలను ఎందుకు వెళ్లగొట్టారని ప్రశ్నించారు.

అమరావతిలో కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ, సచివాలయం కడితే వాటిని వదిలేసి మళ్లీ విశాఖలో కడతారా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును సొంత అవసరాలకు వాడుకునే హక్కు మీకెవరు ఇచ్చారన్నారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఐఏఎస్ ల భవనాలు 75 శాతం పూర్తయ్యాయని.. వీరికి విశాఖలో ఎక్కడ ఇళ్లు కేటాయిస్తారన్నారు.
 
అమరావతి ముంపు ప్రాంతం కానప్పటికీ కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా కొండవీటి వాగును చంద్రబాబు పూర్తిచేశారన్నారు. ఎందుకు మీకు అమరావతిపై కక్ష? గెజిటెడ్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల కోసం చేపట్టిన భవన నిర్మాణాలు సగానికి పైగా పూర్తయ్యాయన్నారు. ఉన్నవాటిని ఉపయోగించుకోకుండా ఇంకెక్కడో ఏదో చేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట్లాడటం సరికాదని ఆమె పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వానికి కర్నూలుపై ప్రేమ ఉంటే టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన మెగా సీడ్ పార్క్ ను ఎందుకు పునరుద్ధరించడం లేదు? కర్నూలును చంద్రబాబు సిమెంట్ హబ్ గా తయారుచేశారన్నారు. హైకోర్టును కర్నూలు తీసుకెళతామంటున్నారు. రెండు కుర్చీలు, బల్లలు, జిరాక్స్ షాపులు పెడితే కర్నూలు అభివృద్ది చెందేస్తుందా అని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలోనే అమరావతిలో 5 వేల మంది పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. పేదల సొంత ఇంటి కలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు.  టీడీపీ హయాంలో అమరావతిలో విట్, ఎస్ ఆర్ ఎమ్ వంటి ప్రముఖ వర్సిటీలు వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోకపోయుంటే వీటి వల్ల చుట్టుపక్కల ప్రాంతంలో అభివృద్ది చెంది ఎందరికో ఉపాధి లభించేందని చెప్పారు. 


నాడు ప్రతిపక్షనేతగా 2014లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి  రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆమె మండిపడ్డారు. ఆయన చెప్పిన మాటలకు ఆయనే కట్టుబడి ఉండకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు గౌరవించాలి? 13 జిల్లాల అభివృద్ధితో వైసీసీకి సంబంధం లేదా అని ప్రశ్నించారు.

 అంబానీ రికమెండ్ చేసిన వ్యక్తికి రాజ్యసభ సీటిచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే అంబానీని తిరుపతిలో జియో సెంటర్ పెట్టమని ఎందుకు అడగడం లేదు? రూ. 15 వేల కోట్లు పెట్టుబడి పెట్టమని ఈ ప్రభుత్వం ఒక్క లేఖ అయినా రాసిందా? చిత్తశుద్ది అనేది మాటల్లోకాదు చేతల్లో ఉండాలన్నారు.  ప్రజలను గందరగోళంలో పెటి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.

ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం? పాలకులే అభివృద్ధిని నాశనం చేయడం ఎక్కడైనా జరిగిందా? చంద్రబాబు నాయుడు  తాగే హిమాలయా వాటర్ ను కూడా రాజకీయం చేసిన వైసీపీ నేడు మూడు రాజధానుల పేరుతో చేస్తున్నదేమిటన్నారు. అమరావతి ఆగిపోవడంతో లక్షమంది కూలీలు రోడ్డునపడ్డారన్నారు. వారి ఆకలిబాధ ఈ ప్రభుత్వానికి తెలీదా? 13 జిల్లాల అభివృద్దిని నాశనం చేయొద్దని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios