సీఎం జగన్ ప్రభుత్వంలో బడికి వెళ్లే బాలికకు రక్షణ లేదు, కాలేజీలకు వెళ్లే యువతులకు, మార్కెట్ కు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
విజయవాడ: జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కారణంగా రాష్ట్రంలోని యావత్ ప్రజానీకం టీవీ పెట్టాలంటే భయపడిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఏరోజు ఎవరిపై ఎక్కడ అత్యాచారం జరిగిందోనన్న భయంతో పేపర్ చదవాలంటే కూడా వణికిపోతున్నారన్నారు. అయినా కూడా ఈ మొద్దు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు.
''హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటనపై కూడా బైక్ కు టోల్ కడుతూ అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడటం చూసి యావత్ రాష్ట్రం ఆశ్చర్యానికి గురైంది. ఆ ఘటనలో అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ పోలీస్ వ్యవస్థను బ్రహ్మాండంగా పొగిడిన జగన్ ఆ అమ్మాయి పేరిట దిశ చట్టం తీసుకొచ్చామని తెగ ఊగిపోయారు. అయినా కూడా చివరకు ఈ రాష్ట్ర మహిళల భద్రతకు చేసిందేమిటి..? తెలంగాణలో జరిగిన మహిళ పేరు బయటకు రాకుండా దిశ అని పేరు పెడితే.. అనంతపురంలో జరిగిన ఘటనలో మాత్రం యువతి పేరు బయటకు తీసుకొచ్చారు. ఆ యువతి దళితురాలనా అంత చిన్నచూపు..?'' అని నిలదీశారు.
''హత్యకు గురయిన అనంతపురం యువతి తల్లిదండ్రులు రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు చేసిందేమిటి..? పైగా ఇళ్లు మారమని ఉచిత సలహా ఇస్తారా..? యువతి కనిపించకుండా పోయిన రోజు ఫిర్యాదు చేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు..? మొబైల్ ను ట్రాకింగ్ చేసి పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే ఆ యువతి చనిపోయి ఉండేదా..?'' అంటూ ఆవేధన వ్యక్తం చేశారు.
''సీఎం జగన్ ప్రభుత్వంలో బడికి వెళ్లే బాలికకు రక్షణ లేదు, కాలేజీలకు వెళ్లే యువతులకు, మార్కెట్ కు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేదు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలపై ఉండే శ్రద్ధ మహిళల భద్రతపై ఎందుకు చూపరు..? ‘గన్’ కన్నా ముందు జగన్ వచ్చి మహిళలను కాపాడతాడని చెబుతున్న వైకాపా మహిళ నాయకురాళ్లు ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారు..? ఆయన గన్ కాదు.. దీపావళి రోజు పిల్లలు ఆడుకునే పేలని అట్ట తూపాకి అని తెలుసుకోండి'' అని ఎద్దేవా చేశారు.
''దిశ చట్టం రాకముందే చట్టం ద్వారా ముగ్గురికి ఉరి శిక్ష వేశామని ఇంకో మహిళ మాట్లాడుతుంది. మీ మాటలు వింటున్న పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా జగనన్న దేవుడని వైకాపా మహిళ నాయకురాలు మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన బడుగు బలహీన, వెనుకబడిన వర్గాలను పీల్చే జలగన్న అని ఇప్పటికైనా గ్రహించండి. ఇప్పుడు అందరి గుండె జగనన్న అని కాదు.. జగన్ రెడ్డి ఎప్పుడు జైలుకు వెళతాడు..? సీఎంగా ఎప్పుడు దిగిపోతాడని కొట్టుకుంటోందని తెలుసుకొండి'' అని విమర్శించారు.
''చంద్రబాబు హయాంలో అర్థరాత్రి అయినా కూడా మహిళలు క్షేమంగా ఇంటికి చేరేవారు. అది ఆయన ప్రభుత్వం మహిళలకు కల్పించిన భరోసా. కానీ జగన్ రెడ్డి పాలనలో అనంతపురం ఘటనలో యువతి పేరు బయట పెట్టడమే కాకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కనీస చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు అవసరం లేదు. పైగా రాష్ట్రంలో 130 శాతం అత్యాచారాలు పెరిగిపోతే.. 13 శాతమే అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. 13 జిల్లాలలో అత్యాచారం జరగని జిల్లా కానీ, నియోజకవర్గం కాని ఉందా..? ఉందని చెప్పండి నేను రాజకీయాలను నుంచి తప్పుకుంటానికి సిద్ధం'' అని అనురాధ సవాల్ విసిరారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 25, 2020, 4:57 PM IST