ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. రోజా చెప్పిన జగన్ గన్ను కాదని.. అట్ట తుపాకీ అన్నారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా అనురాధ అభివర్ణించారు. 

రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి వైసీపీ (ysrcp) మహిళా మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ (tdp) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha) మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చీరలు, నగలు గురించి తప్ప ఇంకేం మాట్లాడటం రాదా గుడ్డి రోజాకు (rk roja)..? అంటూ అనురాధ దుయ్యబట్టారు. కిరాతకుల చేతిలో బలైపోయిన బాధితులకు చీర కప్పి అండగా నిలుస్తామని చెప్పాల్సింది పోయి వారికి న్యాయం చేయమని అడిగిన చంద్రబాబుకు (chandrababu naidu) చీరలు పంపిస్తానంటారా అంటూ ఫైరయ్యారు. రోజా చెప్పిన జగన్ గన్ను కాదని.. అట్ట తుపాకీ అంటూ అనురాధ ఎద్దేవా చేశారు. 

మహిళలకు రక్షణ కల్పించడం చేతకాని వైసీపీ నేతలు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఫైరయ్యారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా అనురాధ అభివర్ణించారు. అత్యాచారం ఏ రోజు ఎక్కడ జరిగిందో కూడా రాష్ట్ర హోంమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో ఒక్కరినైనా శిక్షించారా? అని అనురాధ ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార దుస్థితిపై వైద్యశాఖ మంత్రి విడదల రజనీ ఒక్క సమీక్ష చేశారా? అని ఆమె నిలదీశారు. కుయ్ కుయ్ మనే అంబులెన్స్‌కు, వైసీపీ మంత్రుల కార్లకు పెద్ద తేడా లేదన్నారు. వైసీపీ జేబు సంస్థగా పనిచేస్తున్న ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వ్యవహరించిన తీరు సరిగాలేదని అనురాధ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి కాబట్టే వారలా పేట్రేగిపోతున్నారని పంచుమర్తి దుయ్యబట్టారు. 

అంతకుముందు గురువారం గుంటూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గిరాల మండలం తుమ్మపుడిలో అత్యాచారం, హత్యకు గురైన మహిళ బంధువులను నారా లోకేష్ పరామర్శించేందుకు గురువారం అక్కడికి వెళ్లారు. అయితే లోకేష్ అక్కడికి వెళ్లిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్లు, కొబ్బరి బొండాలు విసురుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలతో పాటు పాటు పలువురు పోలీసులుకు గాయాలు అయ్యాయి. లోకేష్‌పై వైసీపీ నాయుకులు కావాలనే దాడికి యత్నించారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. 

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు చట్టాలపై గౌరవం, భయం లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరిగితే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 800 మంది మహిళలపై దాడి జరిగిందన్నారు. దాడులు జరిగితే బుల్లెట్ కన్నా వేగంగా వస్తానన్న జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. నిన్న కొందరు మద్యం సేవించి మహిళపై దాడి చేసి హత్య చేశారని అన్నారు. ఈ ఘటనలో ముగ్గురి పాత్ర ఉందని మృతురాలి బంధువులు చెబుతున్నారని అన్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టలేదని తెలిపారు. 

రాష్ట్రంలో సీఎం జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉందని చిత్రీకరిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియ రాజ్యం ఉందన్నారు. తనపై దాడి చేసిన భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు. వైసీపీ నాయకుల దాడిలో తమ కార్యకర్తలకు గాయపడ్డారు. ఇక తాను మూర్ఖుడినే అని.. ఎవరినీ వదలిపెట్టనని అన్నారు. పోస్టుమార్టమ్ జరగకుండానే.. అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి ఉందని నిలదీశారు. ఎస్పీ కాల్ డేటా రికార్డు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలా చెప్పమని ఎస్పీపై ఒత్తిడి తెచ్చిందెవరని ప్రశ్నించారు. సజ్జల అనే జీతగాడు ఎస్పీపై ఒత్తిడి తెచ్చారా అని ప్రశ్నించారు.