ఏలూరులో వింత వ్యాధి విషయంలో ప్రభుత్వం నిజాలు దాస్తోందని ఆరోపించారు టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ నీరు కలుషితం కావటమే ఏలూరులో వింత వ్యాధికి కారణమని వైద్యులు చెబుతున్నారని చెప్పారు.

కొవిడ్‌ వ్యర్థాలను కృష్ణా కాలువలో కలిపేయటమే ఇందుకు ఒక కారణమైతే..  పంపుల చెరువు నీరు తాగటమూ ఈ వ్యాధికి మరో కారణమనే వాదన వినిపిస్తోందని నిమ్మల రామానాయుడు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పంపుల చెరువు వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా ఎందుకు ఆంక్షలు పెట్టిందని ఆయన ప్రశ్నించారు. 

తమ అవినీతి కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే ఏలూరు పరిస్థితే రాష్ట్రమంతా వ్యాపిస్తుందని ఆందోళణ వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలపై దాడులు, కక్షసాధింపులకు చూపే శ్రద్ధ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో లేదని... పది రోజుల క్రితం నుంచే కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ధ్వజమెత్తారు.

నీటిలో తేడా వల్లే వింత వ్యాధని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం నీటి వల్ల కాదని ముందే ప్రకటనలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. బాధితుల సంఖ్య తగ్గించుకునేందుకు రోగులను పరిశీలనలో ఉంచకుండా హడావుడిగా డిశ్ఛార్జి చేస్తున్నారని రామానాయుడు ఆరోపించారు.

విజయవాడ, గుంటూరుల్లో ఉండే అత్యవసర విభాగాలు, ప్రత్యేక వైద్య నిపుణుల బృందాలను ఇంత వరకు ఏలూరులో పెట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నిమ్మల విమర్శించారు.