అమరావతి: పండించిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకే వైసిపి ప్రభుత్వం దొండపాటి విజయకుమార్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేయించడం దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రైతుల కష్టాలు పౌరసరఫరా శాఖమంత్రి కొడాలి నాని, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను కనిపించడం లేదా? అని అడిగినందుకే అరెస్ట్ చేశారని లోకేష్ పేర్కొన్నారు.

''రైతుల్నించి ధాన్యం కొనుగోలు చేయ‌డంలేద‌ని ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ని షేర్ చేశాడ‌ని అరెస్ట్ చేయించావా శాడిస్ట్ జగన్ రెడ్డీ! ధాన్యం ఎప్పుడు కొంటార‌ని ద‌ళిత‌ యువ‌కుడు దొండ‌పాటి విజ‌య్ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్ట‌డం నేర‌మా? ఇదే కేసు పెట్ట‌డానికి ఆధారం అయితే వైసీపీలో 31 కేసులున్న నీ నుంచి బూతులు మాట్లాడే మంత్రుల వ‌ర‌కూ, మార్పింగ్ పోస్టులేసే సోష‌ల్‌ మీడియా ఇంఛార్జ్ ఏ2 రెడ్డి నుంచి పేటీఎం బ్యాచ్ వ‌ర‌కూ మొత్తం జైళ్ల‌లోనే ఉండాలి'' అంటూ లోకేష్ విమర్శించారు. 

''చ‌ట్ట‌ాలను, నిబంధ‌న‌లు అతిక్ర‌మించి చేస్తున్న ఈ అరెస్టులు నిజ‌మైన పోలీసులైతే చేయ‌రు? సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ మీరి నాయ‌కుల ప్రాప‌కం కోసం అక్ర‌మ అరెస్టులు చేస్తున్న వారు పోలీసులు కాదు, ఖాకీ డ్రెస్సులేసుకున్న వైకాపా నాయకులు. ఈ అక్ర‌మ అరెస్టులకు అత్యుత్సాహం ప్రద‌ర్శిస్తున్న వైకాప్స్ త‌గిన‌ మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌దు'' అని లోకేష్ హెచ్చరించారు.

read more  వెంటాడి మరీ... డాక్టర్ సుధాకర్ ని హతమార్చారు...: లోకేష్ సంచలనం

 మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంటిపైకి దాడి చేయడానికొచ్చిన వారిని అడ్డుకున్నందుకే బిసి జనార్ధన్ రెడ్డిపై కేసులా? అని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

బిసి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై చర్చించేందుకు కర్నూలు నాయకులతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిసి జనార్ధన్ రెడ్డిపై, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొందామన్నారు. కర్నూలు జిల్లాలో కరోనా, బ్లాక్ ఫంగస్ తో ప్రజలు చనిపోతుంటే వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 

''గత ఆదివారం నాడు ఎనిమిది మంది తెదేపా నాయకులను అరెస్టు చేసి ఆరుగురు ఇంతవరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచ లేదు. వారు ఎక్కడున్నారో... రెండురోజులు గడుస్తున్నా మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపర్చలేదో చెప్పాలి'' అని చంద్రబాబు ప్రశ్నించారు. 

 ''బిసి జనార్ధన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతాం. పోలీసులు చేస్తున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. హైకోర్టు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని వ్యాఖ్యానించినా సిగ్గురాలేదు'' అంటూ మండిపడ్డారు. వైసీపీ దుర్మార్గాలపై కరోనా నిబంధనలు పాటిస్తూనే వర్చువల్ యాజిటేషన్ చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.