Asianet News TeluguAsianet News Telugu

జగన్‌లా నేను పారిపోను, ఆధారాలుంటే నిరూపించండి : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై నారా లోకేష్

తనపై వైసీపీ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్‌లా నేను పారిపోవడం లేదు.. దమ్ముంటే నిరూపించండంటూ బహిరంగంగా సవాల్‌ విసురుతున్నానని అన్నారు.

tdp leader nara lokesh slams ysrcp over ap skill development scam
Author
First Published Dec 7, 2022, 9:31 PM IST

టీడీపీ డీఎన్‌ఏనే బీసీ.. బీసీల గుండెల్లో ఉండేదే టీడీపీ అన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. బుధవారం ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కాపీ క్యాట్‌ వచ్చి రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మారనంటూ దుయ్యబట్టారు. బీసీలకు జగన్‌ చేసింది సున్నా, ఇచ్చిన హామీలు సున్నా, మరి జయహో బీసీ ఎందుకో అర్థం కావడం లేదని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్యాలెస్‌ పిల్లి కాపీ క్యాట్‌.. బీసీ సదస్సుకు మేం పెట్టిన పేరే పెట్టారని ఆయన మండిపడ్డారు. మేం అప్పట్లో జయహో బీసీ సదస్సు కోసం పాట తయారు చేశాం, కావాలంటే ఆ పాట కూడా పంపుతాం, వాడుకో అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. 

ALso REad:స్కిల్ డెవలప్‌మెంట్ అతిపెద్ద స్కామ్.. చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతుందా?: సజ్జల

జగన్‌ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 8 శాతం కోత పెట్టారని... దాదాపు 26 ఏళ్ల పాటు బీసీలు 34 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తే, జగన్‌ వచ్చి దాన్ని 26 శాతానికి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కార్పోరేషన్‌ ద్వారా టీడీపీ రూ. 6 వేల కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ఖర్చు పెట్టింది సున్నా అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. బీసీ సబ్‌ ప్లాన్‌ తెచ్చిందే టీడీపీ, చంద్రబాబని ఆయన గుర్తుచేశారు. బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా రూ. 34 వేల కోట్లు కేటాయిస్తే రూ. 30 వేల కోట్లు ఖర్చు పెట్టామని లోకేష్ తెలిపారు. బీసీ సబ్‌ ప్లాన్‌ కోసం వైసీపీ ఖర్చుపెట్టింది సున్నా అంటూ ఆయన దుయ్యబట్టారు. 

ఆదరణ పథకం ద్వారా రూ. వేయి కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ఖర్చు పెట్టింది సున్నా అని లోకేష్ ధ్వజమెత్తారు. సజ్జల, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు బీసీలంటే నరనరాన ద్వేషం, కోపమన్నారు. పుంగనూరులో బీసీ కులానికి చెందిన రామచంద్రయాదవ్‌ అనే జనసేన నేత పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఇంటి మీద దాడి చేశారని లోకేష్ పేర్కొన్నారు. రామచంద్రయాదవ్‌ ఇంటిని, కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. రామచంద్రయాదవ్‌ ఇంటి మీదకు 350 మందిని దాడికి పంపారని... సొంత సామాజిక వర్గమైన రెడ్ల మీద పెద్దిరెడ్డి ఎందుకు దాడి చేయలేదని లోకేష్ ప్రశ్నించారు. 

బీసీ కాబట్టే.. రామచంద్రయాదవ్‌పై దాడి చేశారని , జగన్‌ సీఎం అయ్యాక 34 మంది బీసీ నేతలను చంపేశారని ఇదేనా వైసీపీ జయహో బీసీ నినాదమని ఆయన నిలదీశారు. సలహాదారు పదవుల్ని ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారని లోకేష్ దుయ్యట్టారు. మిగిలిన కులాల్లో మేథావుల్లేరా , 60 కార్పోరేషన్లు ఏర్పాటు చేశామని, కానీ కార్పోరేషన్ల ఛైర్మన్‌లకు కూర్చొనేందుకు కుర్చీలే లేవని ఆయన ఎద్దేవా చేశారు. వీసీల నియామకంలో చంద్రబాబు 16కు గానూ.. 9 మంది బీసీలకే ఇచ్చారని, జగన్‌ 16కు గానూ 13 రెడ్లకే ఇచ్చారని లోకేష్ ఆరోపించారు. 

ALso REad:‘‘స్కిల్’’ స్కామ్‌లో చంద్రబాబు, లోకేశ్‌ల ప్రమేయం.. బొక్కలోకి పోవడం ఖాయం: జోగి రమేశ్ వ్యాఖ్యలు

అందరికీ ఇచ్చిన పథకాల్లో బీసీలకు ఎంతిచ్చారో లెక్కలేస్తారని, ఇది వైసీపీ విధానమని ఆయన దుయ్యబట్టారు. జగన్‌ బటన్‌ నొక్కారు.. కరెంట్‌ ఛార్జీలు పెరిగాయని, జగన్‌ బటన్‌ నొక్కారు.. చెత్త పన్ను వేశారని లోకేష్ ఆరోపించారు. జగన్‌ ఓ బటన్‌ రెడ్డి... అలా బటన్‌ నొక్కుతూ కూర్చొంటారని దుయ్యబట్టారు. అమర్‌రాజాను తెలంగాణకు పంపేశారు.. అదేంటంటే పొల్యూషన్‌ అంటారని ఎద్దేవా చేశారు. రామ్‌ ఏమన్నా పిచ్చొడా పొల్యూషన్‌ ఉన్న కంపెనీని తీసుకోవడానికి అని లోకేష్ ప్రశ్నించారు. ఏపీ పరిశ్రమలు తీసుకెళ్లండని తెలంగాణతో ఏమన్నా రహస్య ఒప్పందం చేసుకున్నారా అని ఆయన నిలదీశారు. అత్యధిక పొల్యూషన్‌ ఉండేది సిమెంట్‌ కంపెనీల్లోనే అన్న.. ఆ లెక్కన భారతీ సిమెంట్స్‌ను ముందు పంపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపైనా లోకేష్ స్పందించారు. దమ్ము ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌లా నేను పారిపోవడం లేదు.. దమ్ముంటే నిరూపించండంటూ బహిరంగంగా సవాల్‌ విసురుతున్నానని అన్నారు. ఆధారాల్లేకుండా తన మీద ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని లోకేష్ హెచ్చరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో నాకెవరైనా మెసేజ్‌ చేశారా..? నా అకౌంట్‌కు ఏమైనా డబ్బులు వచ్చాయా..? అనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని లోకేష్ నిలదీశారు. ఆధారాలుంటే గర్జించండి.. ఎందుకు మ్యావ్‌ మ్యావ్‌ అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సంపాదించాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, స్టాన్‌ ఫోర్డ్‌లో తనతో చదువుకున్న వాళ్లు.. నెలకు రూ. 30 కోట్లు సంపాదిస్తున్నారని లోకేష్ తెలిపారు. 1500కు పైగా ఫైళ్లను క్లియర్‌ చేశాను.. కానీ ఒక్క తప్పును కూడా వైసీపీ నిరూపించలేకపోయిందని ఆయన తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios