రాష్ట్రంలో పెద్ద పిల్లి జగన్ రెడ్డి అని ఆయన పార్లమెంట్‌కి 28 చిన్న పిల్లుల్ని పంపాడని .. 22 పిల్లులు లోక్ సభ లో, 6 పిల్లులు రాజ్యసభ లో ఉన్నాయంటూ నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఆయన ప్రసంగించారు. మోడీని చూస్తే మియాం అంటాయ్... ఆయన ఏ బిల్లు తెచ్చినా మియాం అంటాయి, ఇంకో పిల్లిని పంపుదామా అంటూ సెటైర్లు వేశారు.

పుదిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని.. బీజేపీ ప్రకటిస్తే పిల్లుల బ్యాచ్‌లో పిల్లి సుభాష్ అండ్ కో పుదిచ్చేరికి వెళ్లి బీజేపీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు.

28 మంది ఎంపీలు ఎం పీకారన్న ఆయన.. రాష్ట్ర సమస్యలపై ఎలాగో పోరాడరని కనీసం నెల్లూరు జిల్లా సమస్యలపై ఒక్క రోజైనా పార్లమెంట్‌లో మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.

కృష్ణపట్నం, దుగ్గిరాజపట్నం, రామాయపట్నం పోర్టులు, నెల్లూరు ఎయిర్ పోర్ట్ పోయాయని లోకేశ్ గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడుతోంది ఒక్క టీడీపీ ఎంపీలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

గతంలో ఎవరినైనా కలిస్తే బాగున్నారా అని అడిగేవాళ్ళమని.. బాదుడు రెడ్డి పాలనలో బ్రతికున్నారా అని అడగాల్సి వస్తుందని లోకేశ్ సెటైర్లు వేశారు. యువకులకు ఒక్క ఉద్యోగం రాలేదని..  వైసీపీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించారు.

మహిళల్ని అర్ధఒడితో మోసం చేశాడని... ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి అమ్మ ఒడి అన్నారని, కానీ ఇప్పుడు ఒక్క బిడ్డకే అంటున్నారంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి వల్ల సొంత చెల్లెళ్ళకే న్యాయం జరగలేదని.. ఒక చెల్లెమ్మ ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతుంటే...ఇంకో చెల్లెమ్మను తెలంగాణకు తరిమేశారని లోకేశ్ ధ్వజమెత్తారు.

జగన్ సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ను దారుణంగా చంపేస్తే ఈరోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని.. ఇక రాష్ట్రంలోని మహిళలకు జగన్ న్యాయం ఎలా చేస్తాడని ప్రశ్నించారు.

తిరుపతి ఎంపీగా ఉన్నప్పుడు బల్లి దుర్గాప్రసాద్‌కి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారని లోకేశ్ ఆరోపించారు. దళితుడనే కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన మీడియా ద్వారా బాధని వ్యక్తం చేశారని గుర్తుచేశారు.

దళిత నేత చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి వెళ్లని జగన్.. ఆయన సామాజిక వర్గం ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి చనిపోతే స్పెషల్ ఫ్లైట్‌లో క్షణాల్లో వాలిపోయాడని లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పక్కన దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నిలబడితే... మంత్రి పెద్దిరెడ్డి దర్జాగా కూర్చుంటాడని వ్యాఖ్యానించారు.