ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : రాక రాక వచ్చారు కాఫీ తాగి వెళ్లండి .. సీఐడీ అధికారులతో నారా లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులకు లోకేష్ టీ, కాఫీ ఆఫర్ చేశారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో వున్న లోకేష్ వద్దకు సీఐడీ అధికారులు వచ్చి నోటీసులు అందజేశారు. అక్టోబర్ 4న తాడేపల్లిలోని ఏపీ సీఐడీ కార్యాలయంలో ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని లోకేష్ ప్రశ్నించగా.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అని అధికారులు తెలిపారు. అయితే తనకు వాట్సాప్‌లో నోటీసులు పంపారని , మళ్లీ ఎందుకొచ్చారని లోకేష్ అడిగారు. తాము ఢిల్లీలోనే వున్నందున ఫిజికల్‌గా నోటీసు ఇచ్చి వెళ్దామని వచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
ALso Read: ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణకు రావాలని ఆదేశం
అయితే తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులకు లోకేష్ టీ, కాఫీలను ఆఫర్ చేశారు. అయితే సీఐడీ అధికారులు నవ్వుతూ తిరస్కరించారు. రాకరాక వచ్చారు కాఫీ తాగి వెళ్లాలని లోకేష్ అన్నారు. ఇదే సమయంలో 41 ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు అధికారులు లోకేష్‌కు తెలపగా.. 41-3, 41-4 సెక్షన్‌లోని విషయాలను వివరించాలని లోకేష్ కోరారు. దీంతో 41 ఏ సెక్షన్ గురించి లోకేష్‌కు వివరించారు అధికారులు . లోకేష్‌కు నోటీసులు ఇచ్చే సమయంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కూడా అక్కడే వున్నారు. ఈ సందర్భంగా నోటీసులను ఆయన పరిశీలించారు. సాక్ష్యాధారాలను తాను ట్యాంపరింగ్ చేయనని, నోటీసులను క్షుణ్ణంగా చదువుకుంటామని లోకేష్ సీఐడీ అధికారులతో అన్నారు.