Asianet News TeluguAsianet News Telugu

మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో.. గ్రామానికి సర్పంచ్ అంతే, రూ. 1,309 కోట్లు ఇచ్చేయండి : జగన్‌కు లోకేశ్ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. పంచాయ‌తీ వ్యవ‌స్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేత‌ర చ‌ర్యలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు

tdp leader nara lokesh letter to ap cm ys jagan over panchayat funds
Author
Amaravati, First Published Nov 30, 2021, 5:15 PM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు (ys jagan) టీడీపీ (tdp) నేత నారా లోకేశ్ (nara lokesh) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల (grama panchayat) నుంచి మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని లోకేశ్ మండిపడ్డారు. మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతేనని చెప్పారు. సర్పంచులను ఆటబొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థని (panchayat raj system) నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని నారా లోకేశ్ సూచించారు.

ఆ లేఖలో నారా లోకేశ్ ఇలా  అన్నారు... ‘‘గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సానిటేషన్, లైటింగ్ ప‌నుల కోసం గ్రామ‌ పంచాయ‌తీల‌కు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధుల‌ను మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. ప‌ల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా దిగ‌జారిపోవడంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయ‌తీల‌కు నేరుగా ఇచ్చిన నిధులను పంచాయ‌తీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగ‌ విరుద్ధం. 

Also Read:ఆయనవి బురద రాజకీయాలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

సుమారు 4 నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.344 కోట్లను విద్యుత్ బకాయిల క్రింద జ‌మ చేసుకున్నామని ఇప్పుడు ఆర్థిక‌మంత్రి ప్రక‌టించ‌డం బాధ్యతారాహిత్యమే అవుతుంది. 1984లో అప్పటి ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు ఎటువంటి ఆదాయం లేని మైనర్ పంచాయతీల్లోని వీధి దీపాలకు ఉచిత విద్యుత్‌ని అందించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ముఖ్యమంత్రులు కూడా అదే విధానాన్ని కొనసాగించారు. గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన నిధులను త‌క్షణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలి. ఉచిత‌ విద్యుత్ ప్రయోజ‌నం అందుకుంటోన్న పంచాయ‌తీల నుంచి కార్యవ‌ర్గాల‌కు తెలియ‌కుండా రూ.344 కోట్లు విద్యుత్ పాత‌బ‌కాయిల పేరుతో తీసుకోవ‌డం స‌ర్కారు గూండాగిరి కింద‌కే వ‌స్తుంది.  

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ‌బ‌ద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ (ap state finance commission) , మైనింగ్ సెస్, వృత్తి పన్ను, తలసరి గ్రాంట్, ఇసుకపై వ‌చ్చే ఆదాయాలు రూ.వేల కోట్లు ఎగ‌వేసింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులనూ వాడేయ‌డం చాలా దుర్మార్గమైన చ‌ర్య. సీఎం జగన్‌ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి స‌ర్పంచ్ కూడా అంతే. అటువంటి స‌ర్పంచులను ఆట‌బొమ్మల్ని చేసి, పంచాయ‌తీల నిధులు దారిదోపిడీ దొంగ‌ల్లాగా ప్రభుత్వమే మాయం చేయ‌డం చాలా అన్యాయం. గ్రామాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స‌హ‌క‌రించాలి. పంచాయ‌తీ వ్యవ‌స్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేత‌ర చ‌ర్యలు మానుకోవాలి. ప‌ల్లెల్లో దిగజారిన ప‌రిస్థితులు చక్కదిద్దేందుకు మళ్లించిన నిధులు, ఎగ్గొట్టిన బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి’’ అని  పేర్కొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios