జగన్ మాదిరిగా వాయిదాలు అడగను .. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, స్కాం ఎలా సాధ్యం : నారా లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ మాదిరిగా తాను వాయిదాలు కోరనని చురకలంటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని.. కానీ అందులో స్కాం జరిగిందంటూ కేసు పెట్టారని ఎద్దేవా చేశారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలో జరిగిన మోత మోగిద్దాం కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాదిరిగా తాను వాయిదాలు కోరనని చురకలంటించారు. సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని చంద్రబాబు సూచించారని.. దీనిలో భాగంగానే జగన్‌కు వినిపించేలా మోత మోగించామన్నారు.
వైసీపీ అనుబంధ విభాగంలా సీఐడీ మారిందని.. సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని.. కానీ అందులో స్కాం జరిగిందంటూ కేసు పెట్టారని ఎద్దేవా చేశారు. తాను కనిపించడం లేదంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తున్నారని, ఇదే విషయాన్ని సీఐడీ అధికారులను కూడా అడిగానని లోకేష్ తెలిపారు.
హెరిటేజ్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంతోనే అమరావతిలో భూములు కొనుగోలు చేశామని.. ఇవి కోర్ క్యాపిటల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వున్నాయన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే హెరిటేజ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని.. జగన్ మాదిరిగా క్విడ్ ప్రోకోతో పవర్ ప్లాంట్, వార్తా పత్రిక, వార్తా ఛానెల్ పెట్టలేదని లోకేష్ దుయ్యబట్టారు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో వున్న ప్యాలెస్‌లు ఇతరత్రా ఆస్తులు ఏవీ కూడా జగన్ అతని కుటుంబ సభ్యుల పేరుతో వుండవని.. కానీ మాకు సంబంధించిన ఆస్తులు మొత్తం మా పేరుతోనే వుంటాయని లోకేష్ చురకలంటించారు.
గత పదేళ్లుగా జగన్, విజయసాయిరెడ్డిలు బెయిల్‌పై బతుకుతున్నారని దుయ్యబట్టారు. వారు విదేశాలకు వెళ్లాంటే కోర్టు అనుమతులు తీసుకోవాలని.. తల్లిని ఆసుపత్రిలో పెట్టి నాటకాలు ఆడలేదని లోకేష్ ఎద్దేవా చేశారు. మాపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి నిధులు విడుదల చేసిన అజేయ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డి పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు లేవో సీఐడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కక్ష సాధింపేనని.. ఇందులో చివరికి న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.