ఏపీలో నివర్ తుఫాను విధ్వంసం నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

శనివారం వరుస ట్వీట్లు చేసిన ఆయన గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా జగన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని నారా లోకేశ్ గుర్తుచేశారు. అధికారంలోకొచ్చాక 5వంద‌లు ఇస్తామనడం రివర్స్ టెండరింగ్‌లో భాగ‌మా అంటూ సెటైర్లు వేశారు.

నివర్ తుఫాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరంటూ లోకేశ్ మండిపడ్డారు. గాల్లో మేడ‌లు క‌డుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తే అంతులేని తుఫాను‌ న‌ష్టం తెలుస్తుందని ఆయన హితవు పలికారు.

మీ సాక్షి మీడియా ప్ర‌క‌ట‌న‌లు ,భజన బ్యాచ్ నుంచి వాస్త‌వంలోకొస్తే అన్న‌దాత‌ల ఆర్త‌నాదాలు విన‌ప‌డ‌తాయన్నారు. తాడేప‌ల్లి గ‌డ‌ప దాటి ప్ర‌జ‌ల్లో కొస్తే జ‌నం క‌న్నీళ్లు క‌నిపిస్తాయని నారా లోకేశ్ మండిపడ్డారు.