Asianet News TeluguAsianet News Telugu

ఆరోప‌ణలు కాదు.. ఆధారాలు చూపించండి.. : జ‌గ‌న్ స‌ర్కారుపై నారా లోకేశ్ ఫైర్

Amaravati: చంద్ర‌బాబు అరెస్టు కు సంబంధించి నారా లోకేశ్ మాట్లాడుతూ మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆరోప‌ణ‌లు చేయ‌డం కాదు.. ఆధారాలు చూపించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే, "జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతే పదేళ్ల పాటు బెయిల్ పై ఎలా విడుదల అవుతారు..? వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు ఆగిపోయింది? సీబీఐ కూడా ఎందుకు వెనక్కి వెళ్లిందని" లోకేశ్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.
 

TDP Leader Nara Lokesh challenged the government to show evidence against Chandrababu Naidu RMA
Author
First Published Oct 29, 2023, 2:42 AM IST

TDP National General Secretary Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయ‌కుడు నారా లోకేశ్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ కేసులోనైనా నారా చంద్రబాబు నాయుడుపై ఒక్క ఆధారమైనా చూపించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శనివారం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడును భువనేశ్వరి, లోకేష్ లు కలిశారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును 50 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించడం వెనుక ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల నిర్వాకం పెద్దఎత్తున ఉందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం పోయిందని  పేర్కొన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆ పార్టీ రాజకీయ బ్రోకర్లు వ్యక్తిగత పోరుతో, రాజకీయ పగతో పూర్తిగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు జైలులో చనిపోతారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్న విషయాన్ని ప్రజలు, మీడియా గమనించాలని కోరారు. 50 రోజులుగా చంద్రబాబుపై ఒక్క ఆధారం కూడా ఈ ప్రభుత్వం చూపలేకపోయిందన్నారు. పదేళ్లుగా తమ కుటుంబ ఆస్తులను స్వచ్ఛందంగా ప్రజల ముందు ఉంచుతున్నామని లోకేష్ గుర్తు చేశారు. వారి కుటుంబం తప్పు చేసిందనడానికి ప్రభుత్వం ఒక్క ఆధారమైనా చూపించిందా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు.  చంద్ర‌బాబు ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతీయకుండా అడ్డుకోవడం ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందన్నారు. కరువుతో రైతులు అష్టకష్టాలు పడుతున్నా 32 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనీ, అయినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని లోకేష్ వాపోయారు.

సీఎం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదనీ, ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా రైతులను కలుసుకుని మద్దతు పలకలేదని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే పదేళ్లు బెయిల్ పై ఎలా స్వేచ్చగా ఉంటారనీ, వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎందుకు ఆగిపోయిందనీ, సీబీఐ కూడా ఎందుకు వెనక్కి వెళ్లిందని లోకేష్ ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు నాయుడుకు కంటి ఆపరేషన్‌ అవసరమని ఒకే నేత్ర వైద్యుడు నివేదిక ఇచ్చారనీ, ప్రభుత్వ ప్రమేయంతో వేరే నివేదిక ఇచ్చారని లోకేష్ అన్నారు. ఆ రెండూ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రాజ‌కీయ క‌క్ష‌తో టీడీపీ ప‌ట్ల అధికార పార్టీ ఇలా చేస్తోంద‌ని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios