Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో ఓటమి .. నేను చేసిన పెద్ద తప్పు అదే : పరాజయంపై నారా లోకేష్ విశ్లేషణ

మంగళగిరి అద్భుతమైన నియోజకవర్గమని, ఇక్కడ టీడీపీకి పెద్దగా పట్టులేదని.. ఒకట్రెండు సార్లు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం గెలిచిందని లోకేష్ తెలిపారు. ఏడాది ముందే మంగళగిరికి వచ్చుంటే పరిస్ధితి మరోలా వుండేదని.. తన గురించి ప్రజలకు పూర్తిగా తెలిసేదని ఆయన స్పష్టం చేశారు.

tdp leader nara lokesh analysis on defeat at mangalagiri in ap assembly election 2019 ksp
Author
First Published Dec 19, 2023, 5:59 PM IST

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఒక ఎత్తయితే.. ఆ పార్టీ భావి సారథి, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ దారుణ పరాజయం తెలుగు తమ్ముళ్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమరావతి , రాజధాని ప్రాంతంలో తాను చేసిన అభివృద్ధి నారా లోకేష్‌ను గెలిపిస్తుందని అంచనా వేసిన చంద్రబాబు రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటలుగా వున్న స్థానాలను కాదని మంగళగిరిలో దించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈ పరాజయం చాలా రోజుల పాటు తెలుగుదేశం శ్రేణులను వెంటాడింది. 

దీంతో 2024 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిని వీడి మరో చోటికి వెళ్తారని ప్రచారం జరిగింది. దీనిని ఖండిస్తూ తాను మరోసారి మంగళగిరి నుంచే బరిలోకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు. అందుకు తగినట్లే లోకేష్ కార్యాచరణ మొదలెట్టారు. తాను అందుబాటులో లేకపోయినప్పటికీ కేడర్‌ను జనంలోనే వుంచుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటితో తన యువగళం పాదయాత్రను ముగించిన ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. 

మంగళగిరి అద్భుతమైన నియోజకవర్గమని, ఇక్కడ టీడీపీకి పెద్దగా పట్టులేదని.. ఒకట్రెండు సార్లు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం గెలిచిందని లోకేష్ తెలిపారు. మంగళగిరికి వున్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యానే తనను తాను నాయకుడిగా నిరూపించుకోవడానికి ఈ స్థానమే సరైనదని ఆయన వెల్లడించారు. అయితే గత ఎన్నికలకు కేవలం 21 రోజుల ముందు మంగళగిరికి రావడం తాను చేసిన పెద్ద తప్పిదమని, దీంతో అక్కడి పరిస్ధితులపై అవగాహన పెంచుకోలేకపోయానని లోకేష్ పేర్కొన్నారు. ఏడాది ముందే మంగళగిరికి వచ్చుంటే పరిస్ధితి మరోలా వుండేదని.. తన గురించి ప్రజలకు పూర్తిగా తెలిసేదని ఆయన స్పష్టం చేశారు.

అయినప్పటికీ ఓడిపోయిన క్షణం నుంచి తాను మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు. పాదయాత్ర మినహాయిస్తే మిగిలిన సమయం మంగళగిరికే కేటాయిస్తున్నానని, చిన్న మెసేజ్ పెట్టినా వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో తాను ఓడిపోయిన ఓట్ల తేడా పక్కన ఓ సున్నా చేర్చి 53 వేల ఓట్ల మెజారిటీతో ఈసారి మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారని తాను భావిస్తున్నట్లు లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. యువతకు ఓ వేదిక కావాలనే ఉద్దేశంతోనే తాను యువగళం యాత్ర ప్రారంభించానని ఆయన వివరించారు. పాదయాత్ర ప్రారంభించిన 45 రోజులకే యువగళం ఆంధ్ర గళం అయ్యిందని లోకేష్ చెప్పారు. 

జగన్ పాలనలో బీసీలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని.. సంక్షేమం, అభివృద్ధిని అమలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని.. తాము అధికారంలో వున్నప్పుడు ఏనాడూ వైసీపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేయలేదని లోకేష్ చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios